మరో నెలరోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న ప్రతిపార్టీకి తెలంగాణ కావాలా? వారి వారి బలానికి అదే టానిక్కా? అధికారంలోకి రావాలంటే జాతీయ పార్టీలకు తెలంగాణ బలం అవసరమా? జాతీయ పార్టీల నాయకుల ప్రచారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అసలు అందుకోసమే కాంగ్రెస్ అన్నింటికి తెగించి తెలంగాణ ఇచ్చిందా. ఇదే ఆలోచనతో బిజేపి తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిందా... అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 542 లోక్ సభ స్థానాలున్న దేశంలో కేవలం 19లోక్ సభ స్థానాలున్న తెలంగాణలో పాగా వేసినంత మాత్రానా దేశంలో అధికారానికి బలం ఎలా అవుతుందన్నది ప్రశ్నే. కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్, బిజేపిలు అక్కడ తమ సర్వశక్తులు కేంద్రీకృతం చేయడాన్ని బట్టి చూస్తే తెలంగాణ అంశం మాత్రం జాతీయంగా వారికి చాలా ఉపయోగం అన్నది మాత్రం అర్థం అవుతోంది. ఇంతకీ ఆ ఉపయోగం ఏమిటన్నదే అసలైన అంశం. దేశంలో చిన్న రాష్ట్రాల డిమాండ్ చాలా ఉంది. ఈ డిమాండ్ ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. అంతే కాదు మారిన రాజకీయాల నేపథ్యంలో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకే బలం ఎక్కువ. అందుకే ప్రాంతీయ పార్టీలను తమవైపుకు మరల్చుకోవడం, ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలకు అనుగునంగా నడచుకోవడం ఇప్పుడు జాతీయ పార్టీలకు అవసరం. అందుకే తెలంగాణ అంశం ఇప్పుడు జాతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా మంచి ఆయుధంగా మారింది. తెలంగాణ ఇచ్చింది మేమే అని చూపించి, రేపు అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలు కోరుకుంటున్న వాటిని ఇవ్వాలంటే తామే అధికారంలోకి రావాలని, వస్తే ఇస్తామన్న సంకేతాలను కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ద్వారా పంపించింది. ప్రచారపర్వంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించనున్నారు. అలాగే బిజేపి కూడా ఇప్పటికే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసాం. తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చాం, కాబట్టి చిన్న రాష్ట్రాల ఏర్పాటు మావల్లే సాధ్యం అంటూ ముందుకు పోతోంది. ఇలా ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రం ఇచ్చాక అక్కడ బలం చూపుకోలేకపోతే కూడా ప్రమాదమే కదా. అందుకే తెలంగాణ ఇచ్చి అక్కడ తాము ఎంత బలంగా తయారయ్యామో అన్నది నిరూపించుకోవడానికి ఇప్పడు బిజేపి, కాంగ్రెస్ లు సర్వశక్తులు ఒడ్డి ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇంతకు ముందెన్నడు లేని విధంగా ఇప్పుడు ఆ రెండు పార్టీల జాతీయనేతలు తెలంగాణపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కరీంనగర్ కు సోనియా వచ్చి వెల్లింది. నేడు భువనగిరికి రాహూల్ గాంధీ వస్తున్నారు. ఇదే రోజు ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణకు ప్రచారానికి వస్తున్నారు. బిజేపి నుంచి ఇప్పటికే మోడి వచ్చి మూడు చోట్ల పర్యటించారు. ఈ రోజు సుష్మాస్వరాజ్ తెలంగాణాకు ప్రచారానికి వస్తున్నారు. అంటే అందరికి తెలంగాణ పలితాలు చాలా కీలకంగా మారాయన్నది అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: