సరిగ్గా నాలుగురోజుల్లో తెలంగాణాలో పోలింగ్. ఈ తరుణంలో సిబిఐ కోర్టు సంచలనం క్రియేట్ చేసింది. టిఆర్ఎస్ బాస్ కేసిఆర్, ఆయన మేనల్లుడు, టిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, మాజి టిఆర్ఎస్ నేత విజయశాంతిల ఆస్తులపై సిబిఐ విచారణ చేపట్టాలని పేర్కొంది. ఇది రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందన్ రావు పిటిషన్ పై అప్పుడు స్పందించకుండా, పోలింగ్ కు ముందు స్పందించడంలో ఆంతర్యమేమిటి. అవినీతి మరకలు అంటించడం ద్వారా టిఆర్ఎస్ ను దెబ్బతీయచ్చని కాంగ్రెస్ కుట్రపన్నింది అన్న విమర్శలయితే వినిపిస్తున్నాయి. కారణం సిబిఐ పై కేంద్ర ప్రభుత్వం అజమాయిషి ఉంటుందని, తాము స్వతంత్రంగా ఏమి చేయలేమని ఏకంగా సిబిఐ డైరెక్టరే ఓ దశలో బహిరంగంగా వాఖ్యానించారు. అందుకే దీని వెనుక కూడా కాంగ్రెస్ హస్తం ఉందంటే ఎవరైన నమ్ముతారు. కానీ ఈ ఆదేశాలు ఇచ్చింది కోర్టు అన్న సంగతి ఈ పరస్పర విమర్శల జడివానలో జనం దృష్టికి రాదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి కేసిఆర్. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నష్టపోయేది కాంగ్రెసే. అందుకే కాంగ్రెస్ తన వద్ద ఉన్న అన్ని మార్గాలను విజయం కోసం ఉపయోగించుకుంటోంది. అందులో భాగమే వీరిపై సిబిఐ విచారణ చేపట్టాలన్న నిర్ణయం వెలువడడం అంటున్నారు. ఇది టిఆర్ఎస్ నష్టాన్ని తెస్తుందా, కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది కాంగ్రెస్ కు లాభం చేకూర్చడం ఏమో కాని నష్టాన్ని మాత్రం కలిగిస్తుందంటున్నారు. యూపి కి చెందిన ములాయం విషయంలోను కాంగ్రెస్ ఈ విధానాన్నే అవలంబించిందని కాంగ్రెస్ పై ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు మన రాష్ట్రంలో జగన్ వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పై ఇలాంటి అభియోగమే ఉంది. ఇప్పుడు ఎన్నికల వేల ఈ చర్యకు దిగితే కచ్చితంగా కాంగ్రెస్ కావాలనే చేస్తోంది అంటున్నారు. ఈ భయంతో టిఆర్ఎస్ ఎన్నికల్లో దెబ్బతినడమో, లేక భయపడి తమతో బేరసారాలకు దిగడమో జరుగుతుందని భావించే కాంగ్రెస్ ఇలా చేసిందంటారు. అందుకే ఇది టిఆర్ఎస్ పై కంటే కాంగ్రెస్ పైనే చెడు ప్రభావాన్ని చూపుతుందన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని సానుభూతిగా మార్చుకుంటుంది టీఆర్ఎస్ అన్న అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: