ఎన్నికలు అయిపోయిన పిదప తీరిగ్గాకూర్చుని తెలంగాణలోని అన్ని రాజకీయపార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏపార్టీకి ఎన్నిసీట్లొస్తాయి.. ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై తమకున్న సమాచారం మేరకు అభిప్రాయాలు చెబుతున్నారు. మెదక్ జిల్లాను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడం వాస్తవపరిస్థితికి అద్దంపడుతుందన్నారు. తమ పార్టీయే తెలంగాణ లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయబోతోందన్న హరీష్ రావు, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ దేనని తెలంగాణ ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా టీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే భ్రమలో కొందరు టీకాంగ్ నేతలున్నారని... సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ ఓటమిపాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. హరీష్ రావు లెక్కలిలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ పెద్దల లెక్కలు మరోలా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 50 స్థానాల వరకు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఫలితాలకు సంబంధించి గోబెల్స్ ప్రచారం జరుగుతోందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న లగడపాటి రాజగోపాల్ సర్వేలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. నల్లగొండ జిల్లాలో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ లేరన్న గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు నిజమేనని ఒప్పుకున్నారు. తెలంగాణ లో కొన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మరో టీకాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని... అలాగే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. 16వ తేదీన అన్ని వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరుఎక్కువైందని... ఇది మోడీని ప్రధాని కాకుండా అడ్డుకుంటుందని చెప్పారు. అయితే, మరో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రెడ్డి తెలంగాణ లో కాంగ్రెస్ దే హవా అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల అన్ని అర్హతలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఉన్నాయని . తెలంగాణ నవ నిర్మాణ బాధ్యతలను జానారెడ్డి తీసుకుంటారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో అందరం పని చేస్తామని తెలంగాణ రాష్ట్రాన్నిసస్యశ్యామలం చేస్తామని చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: