పోలవరం - ఎవరికి వరం - ఎవరి శాపం..? పోలవరం నేపథ్యం పోలవరం.. దేశానికి స్వాతంత్యం రాక ముందు డిజైన్ చేసిన ప్రాజెక్టు ఇది. వృథాగా సముద్రంలో కలుస్తున్నగోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం దీని లక్ష్యం.. దీని నిర్మాణం పూర్తయితే తూర్పు, పశ్చిమ, విశాఖ, కృష్ణా, గుంటూరు మొత్తం 5 జిల్లాల్లోని 8 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అలాగే కృష్ణా బ్యారేజీకి 80 టిఎంసీల నీరు మళ్లించవచ్చు.. విశాఖ జిల్లా పారిశ్రామిక అవసరాలకు, మరో 543 గ్రామాల తాగునీటి అవసరాలను కూడా తీర్చవచ్చు.. గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. ఈ నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒక రకంగా ఇది కోస్తాంధ్రకు గొప్పవరం. అయితే అనేక కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే శంకుస్థాపనరాయి వేసినా.. వైఎస్ హయంలో కానీ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం డివిజన్లోని 207కు పైగా గ్రామాలు నీట మునుగుతాయి. ఒడిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా దీని నిర్మాణంపై అభ్యంతరాలున్నాయి.. కాంగ్రెస్ నేతల నిర్వాకం... రాష్ట్రవిభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. కోస్తాంధ్రులను కూల్ చేయాలన్న వ్యూహంతో సీడబ్ల్యూసీ తీర్మానంలోనే అదే విషయం ప్రకటించారు. పోలవరం నిర్మాణానికి అనుకూలంగా భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలుపుతారని కూడా వార్తలు వచ్చాయి.. దీనిపై వాడి వేడి చర్చలు జరిగాయి. చివరకు భద్రాచలం డివిజన్ మొత్తాన్ని సీమాంధ్రలో కలపకుండా ముంపు గ్రామాలను మాత్రమే కలిపేలా నిర్ణయం తీసుకున్నారు. పోనీ అదైనా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారా.. అంటే అదీ లేదు. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని చట్టంలో చేర్చకుండా.. ఆర్డినెన్స్ ద్వారా ఆ పని చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కారు చివరి రోజుల్లో తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడం... పార్లమెంట్ సమావేశాల గడువు ముగుస్తుండటం వంటి కారణాలతో హడావిడిగా పని కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు. వారి పుణ్యమా అని ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాలు ఈ విషయంపై తన్నుకునే పరిస్థితి కల్పించారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో రాజధాని అంశం సహా అన్నీ అంశాలను కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగానే తీసుకుందన్న సీమాంధ్రుల ఆగ్రహజ్వాలల కారణంగానే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ మాడి మసైపోయింది. తమకు అనుకూలంగా ఉన్న ఒకే ఒక్క అంశం పోలవరం విషయంలోనూ కాంగ్రెస్ పూర్తి న్యాయం చేయలేకపోయింది. తాజాగా ఏం జరిగింది... పోలవరం నిర్మాణానికి అనుకూలంగా.. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్ పై బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ సంతకం చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. మోడీ కేబినెట్ సమావేశమైన తొలి రోజైన మంగళవారమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నా.. రహస్యంగా ఉంచారు. ఈ విషయం బుధవారం బయటకు వచ్చింది. దీన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ కేంద్రం వైఖరిని మంగళవారమే తీవ్రంగా నిరసించారు. ఆర్డినెన్సుకు ప్రణబ్ ఆమోద ముద్రపడిందన్న విషయాన్ని ధ్రువీకరించుకున్న తెరాస శ్రేణులు బంద్ కు పిలుపు ఇచ్చారు. దీనికి సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం నుండి నిరవధిక నిరహార దీక్ష చేయనున్నారు. కేసీఆర్ వ్యూహం ఏంటి..? రాష్ట్రవిభజన అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అన్ని అంశాల్లోనూ తమకు అనుకూలంగానే నిర్ణయాలు రావాలని ఆశించడం అత్యాశే అవుతుంది. అందులోనూ రాష్ట్ర విభజనకు కూడా అంగీకరించిన సందర్భంలో కొన్ని త్యాగాలకూ సిద్దపడాల్సి ఉంటుందన్న విషయం గులాబీ బాస్ కు తెలియందేమీ కాదు. అందుకే ఆయన ఈ పోలవరం ముంపు గ్రామాల విషయాన్ని అంతకు ముందు పెద్దగా లేవనెత్తలేదు. ముందు రాష్ట్రం వస్తే చాలు.. తర్వాత సంగతి తర్వాత.. అన్న తరహాలో వ్వవహరించాడు. ముంపు గ్రామాల విషయం గట్టిగా మాట్లాడితే.. అసలుకే ఎసరొస్తుందని వ్యూహాత్మకంగానే మౌనం వహించారని భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. సుప్రీంకోర్టులో కొన్ని కేసులున్నా... ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రవిభజన ఆగదు. అందుకే ఇప్పుడు ఈ అంశంపై కేసీఆర్ పట్టుపడుతున్నాడు. పోలవరం నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదంటున్న కేసీఆర్ డిజైన్ మార్చాలని కోరుతున్నాడు. రాజకీయ ఎత్తుగడేనా..? తెలంగాణ ప్రతినిథిగా తమకు తాము అభివర్ణించుకుంటున్నా..ఇంకా టీఆర్ఎస్ రాష్ట్రమంతటా విస్తరించలేదు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రాజకీయాల పరంగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ జిల్లాలో నిన్నమొన్నటి వరకూ టీఆర్ఎస్ ఊసేలేదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పెద్దగా దృష్టిసారించలేదు. గతంలో ఈ జిల్లాలో జరిగిన ఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన దాఖలాలు లేవు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస కనీసం బరిలో కూడా దిగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పేరుకు పోటీ చేసినా.. ఆ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల నాలుగైదు స్థానాల్లో ఉన్నారు. సరిహద్దు జిల్లా కావడం, ఎక్కువగా గిరిజన ప్రాంతం కావడం వల్ల.. ఇక్కడ టీఆర్ఎస్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొడుకు జలగం వెంకట్రావు..చివరి నిమిషంలో జగన్ పార్టీ నుంచి కారు పార్టీకి మారి కొత్తగూడెంలో పోటీ చేసి విజయం సాధించకపోతే.. అసలు టీఆర్ఎస్ కు ఈ జిల్లా నుంచి అసెంబ్లీలో ప్రాతినిథ్యమే లభించేది కాదు. జలగం పుణ్యమా అని.. మొత్తానికి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క స్థానమైనా సంపాదించగలిగింది. ఇప్పుడు ముంపు గ్రామాల తరపున పోరాడి.. ఖమ్మం జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భావించొచ్చు. ఇన్నాళ్లూ 4 జిల్లాల పార్టీ అంటూ మిగిలిన పార్టీలు ఎద్దేవా చేసినా.. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించి.. ఆశించినదానికంటే ఎక్కువ ఫలితాలే రాబట్టాడు కేసీఆర్. అడవి బిడ్డల గోడు పట్టదా..? పోలవరం ఎవరికి వరమైనా.. తమకు మాత్రం తీరని శాపం అంటున్నారు ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని గిరిజనులు. పోలవరం నిర్మాణం కారణంగా తెలంగాణలోని 210 వరకూ గ్రామాలు.. ఛత్తీస్ ఘడ్ లోని 10 గ్రామాలు, ఒరిస్సాలో 10 గ్రామాలు ముంపుకు గురవుతాయని అంచనా. దాదాపు 3 లక్షల మంది కొంపాగూడూ వదలి వెళ్లాల్సి ఉంటుంది. లక్షల ఎకరాల అటవీ భూమి నీట మునుగుతుంది. ఈ ముంపు ప్రాంతాల గిరిజనులు ఇప్పటికే.. అభివృద్ధి ఆమడదూరంగా.. కేవలం అడవితల్లినే నమ్ముకుని బతుకుతున్నారు. వారికి అడవే జీవనాధారం.. ఇప్పుడు వారి జీవితాల్లో అంధకారం అలముకుంటుంది. పరిహారం ఇస్తామని చెప్పినా... గతంలో ప్రాజెక్టుల పునరావాసాల, పరిహారాల ఎంతవరకూ అందాయో అందరికీ తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక తరం దాటిపోయాక.. ఇటీవల కొంత మందికి ఉపాధి అవకాశం కల్పించారు. అందుకే భద్రాచలం డివిజన్ వాసులు పోలవరం పేరు చెబితేనే వణికిపోతున్నారు. మరి ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు లాభనష్టాలు ఉంటాయి. కొంత మంది త్యాగాలకు సిద్ధం కాకపోతే.. గొప్ప గొప్ప ప్రాజెక్టులు సాకారం కావు. పోలవరం డిజైన్ మారిస్తే ఏమవుతుంది...? పోలవరం ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులు. దీన్ని 100 అడుగులకు తగ్గించేలా డిజైన్ మార్చాలని తెలంగాణవాదులు కోరుతున్నారు. దీని వల్ల ముంపు నష్టం చాలావరకూ తగ్గుతుందంటున్నారు. అయితే ఇలా ఎత్తు తగ్గిస్తే ఏంటి నష్టం.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. 200 టీఎంసీలకు బదులు 60 టీఎంసీల నీరు నిల్వఉంటుంది. అయితే ఈ మొత్తం సర్కారు లక్ష్యాన్ని అందుకుంటుందని... దీని వల్ల నీటి వనరులకు ఎలాంటి ఇబ్బంది రాదని... విద్యుత్ ఉత్పత్తి మాత్రం తగ్గిపోతుందని చెబుతున్నారు. 80 టిఎంసీల నీటిని కృష్ణాకు తరలించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఢిల్లీలో మాట్లాడిన కేసీఆర్ కూడా పోలవరం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. కానీ డిజైన్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఇప్పుడు గిరిజన పల్లెలను బలవంతంగా సీమాంధ్రలో కలిపేసినా.. రేపు ఒడిషా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అభ్యంతరాల కారణంగానైనా పోలవరానికి ఇబ్బందులు తప్పవన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు పోలవరంపై రాజకీయ పార్టీలు సీమాంధ్ర ప్రజలకు ఎక్కువగా ఆశలు కల్పిస్తున్నాయని.. అది వాస్తవం కాదని.. గిరిజనులకు అండగా నిలుస్తామంటున్న వామపక్షాలు చెబుతున్నాయి. రాజకీయ పరిష్కారం అవసరం.. పోలవరం నిర్మాణం జరగాలంటే ముంపు ప్రాంతాల సహకారం తప్పనిసరి.. అందుకే రాజకీయ పార్టీల్లోనూ, ప్రజాసంఘాల్లోనూ ఈ అంశంపై విస్తృతమైన చర్చ జరపాలి. ముంపు ప్రాంతాలకు సాధ్యమైనంతగా నష్టాన్ని పరిమితం చేయాలి. గత ప్రాజెక్టుల పరిహారాల్లాగా బాధితులను పరిహాసం చేసేలా కాకుండా మంచి పునరావాసా ప్యాకేజీ ఇవ్వాలి. ఈ అంశం నుంచి రాజకీయ లబ్ది పొందాలని చూడకుండా.. సామరస్య పరిష్కారం దిశగా అడుగులు పడాలి. లేకుండా.. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య సామరస్యవాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: