చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో రోజుకో మాట చెబుతూ.. సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా రాజధాని విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ కసరత్తు ఇంకా కొనసాగుతోంది. రాయలసీమతో పాటు మరి కొన్ని జిల్లాల్లోనూ కమిటీ పర్యటించాల్సిఉంది. ఆగస్టు నెలలోకాని ఈ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. మొదట ముఖ్యమంత్రే స్వయంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో గుంటూరు, విజయవాడ మధ్యే రాజధాని నగరం ఏర్పాటు కానుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఇంతలో.. ముఖ్యమంత్రికి సన్నిహితంగా వ్యవహరించే ఒక మంత్రి గుంటూరు జిల్లాలోని అమరావతికి రాజధాని యోగం పట్టనుందని మీడియాకు లీక్‌ చేశారు. అమరావతి ప్రాంతంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూములున్నాయని, భూసేకరణ సమస్య కాదని అధికారులు సిఎంకు చెప్పారని దీనికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నది ఆయన చెప్పిన సమాచార సారాంశం. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో ఆ ప్రాంతంలోనూ భూముల ధరలూ ఆకాశానికెగిశాయి. అమరావతి ప్రచారం ఇంకా సాగుతుండగానే మరికొన్నిప్రాంతాల పేర్లూ తెరమీదకు వస్తున్నాయి. మంత్రిమండలి సమావేశంలో వినుకొండ, పులిచింతల ప్రాంతాలు చర్చకు వచ్చాయని రాజధాని నగరం ఇక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైందన్న ప్రచారం ప్రారంభమైంది. వీటితో పాటు విశాఖను పూర్తిగా పక్కకు పెట్టేయలేదని ఆ ప్రాంత నాయుకులు చెబుతున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటికొరత ఉన్నందువల్ల... నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని రాజమండ్రినే రాజధాని చేయాలని గోదావరి జిల్లాల నేతలు చెబుతున్నారు. సీమవాసులు శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలంటున్నారు.. అదే జరిగితే.. కర్నూరు రాజధాని అవుతుంది. రాజధాని ఎక్కడో తేల్చకుండా ఇంకా ఎన్నాళ్లు ఇలా ప్రాంతాలతో దాగుడు మూతలు ఆడతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: