"" హైదరాబాద్ పోయింది.. సీమాంధ్రకు అన్యాయం జరిగింది. నేను సమన్యాయం చేయమన్నాను. కానీ కాంగ్రెస్ వినలేదు. రాష్ట్రాన్ని విభజించేసింది. అయినా భయపడొద్దు.. నేనున్నా, ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు మరో రాజధాని నిర్మిస్తా.. ఒక హైదరాబాద్ కాదు, ఎన్ని హైదరాబాద్ లు కావాలంటే అన్ని నిర్మించి పెడతా... తెలుగుదేశానికి అధికారం ఇవ్వండి చాలు...'' అంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఈ ప్రాసలూ, వ్యాఖ్య నిర్మాణాలు కూడా ఎవరూ మరిచిపోలేరు ఎందుకంటే... బాబు అనేక సార్లు ఈ మాటలను చెప్పాడు. మరి ఎన్నికల ముందు ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని నిర్మించి పెడతానని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అప్పుడేమో ఆరు నెలల్లో రాజధాని ని నిర్మించేస్తానని అన్న ఆయన ఇప్పుడు సీమాంద్రకు కొత్త రాజధాని నిర్మాణానికి కనీసం 20 యేళ్లు పడుతుందని అంటున్నాడు! కనీసం రెండు నెలలు అయినా సరిగా గడవకముందే చంద్రబాబు తనలోని తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు! రాజధానిని నిర్మించడం అంటే... అది మంచి నీళ్లు తాగినంత సులభమన్నట్టుగా మాట్లాడేవాడాయన. అది కూడా ఎన్ని హైదరాబాద్ లు కావాలంటే అన్ని హైదరాబాద్ లు అంటూ బాబు చాలా తేలికగా, అలవోకగా మాట్లాడేసేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ కాదని అంటున్నాడు. "నాకు అనుభవం ఉంది..' అంటూ సొంతంగా సర్టిఫికెట్ ఇచ్చుకొన్న పెద్దమనిషి ఇప్పుడు అనుభవపూర్వకంగా మాట్లాడుతూ 20 యేళ్ల సమయం కోరుతున్నాడు! మరి రాజధాని నిర్మాణం కోసం పట్టే సమయం గురించి మాట్లాడుతున్న బాబు అంత వరకూ అధికారం తనకే ఇవ్వాలని కోరుతున్నాడని, ఈ ఐదేళ్లలో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని కూడా అప్పుడే స్పష్టం చేస్తున్నాడు కాబోలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: