తెలుగు నేలకు ఆవల తెలుగువారి మృత్యుఘోష ఈమధ్య పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న చెన్నైలోని ఓ బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఉత్తరాంధ్రకు చెందిన కూలీలెందరో సజీవ సమాధి అయ్యారు. పొట్టచేతబట్టుకుని ఉపాధి కోసం వెళ్లి.. శవాలుగా తిరిగొచ్చారు. ఇవాళ.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలిన దుర్ఘటనలో మళ్లీ తెలుగువారే.. అందులోనూ ఉత్తరాంధ్రవారే.. 9 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తెలుగువారి ఈ మృత్యుఘోష కొత్తదేమీ కాదు. మొన్నటికి మొన్న ఇరాక్ లో చెలరేగిన అంతర్యుద్ధం ఎంతో మంది తెలుగువారి జీవితాల్లో అలజడి రేపింది. ఇప్పుడిప్పుడే వారు బతుకు జీవుడా అంటూ సొంత ప్రాంతానికి వస్తున్నారు. అదే పరిస్థితి విషమించి ఉంటే.. అంతర్యుద్ధం.. భీకర యుద్ధంగా మారితే ఎంత మంది చనిపోయేవారో.. అంతేనా.. గల్ఫ్ దేశాలకు ఉపాధికి వెళ్లి మనవాళ్లు పడుతున్న అవస్థలు ఇన్నా.. అన్నా.. ఎన్నని చెప్పగలం.. అన్నీ ఉన్న తెలుగునేలలో పుట్టిన వారికి ఎందుకీ దుస్థితి. ఉపాధి కోసం.. రాష్ట్రాలు దాటి దేశాలు దాటి పోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడుతోంది. ఈ నేలపై పుట్టినవారికి పట్టెడన్నం ఎందుకు కరవవుతోంది. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.. గతం గతః. ప్రస్తుతం చంద్రులిద్దరూ ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరిని మించిన వారు మరొకరు... ఎవరినీ తీసిపారేయలేం. ఒకాయన దాదాపు పదేళ్లు తెలుగునేలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలినవాడు. బిల్ గేట్స్ వంటి అమెరికన్ ప్రెసిడెంటును ఏపీకి రప్పించినవారు.. హైదరాబాద్ కు కొత్త లుక్ తీసుకొచ్చి ఐటీ సిటీగా మార్చినవాడు. ఇంకొకాయన కూడా ఏమీ తక్కువ తినలేదు. 1969 నాడు ఉజ్జ్వలంగా వెలుగు వెలిగి.. తదనంతరం చప్పబడిపోయిన ఉద్యమాన్ని పునరుజ్జీవింపచేసిన వాడు. తెలంగాణ ప్రజల్లోని ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి.. దాన్ని పదేళ్లపాటు ఉద్యమంగా సజీవంగా నిలిపి... ప్రత్యేక రాష్ట్రం సాధించినవాడు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతంపైనా అవగాహన కలిగిన ఉద్దండుడు. చంద్రబాబూ, చంద్రశేఖరా.. ఉభయ చంద్రులూ.. ఈ ఘోర అవస్థ తెలుగువాడికి తప్పంచండి. ఈనేల మీద ఉపాధి దొరికే మార్గం చూపి.. పుణ్యం కట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: