ఒక వ్యక్తికి గంటన్నర సేపట్లో 18 సార్లు ఫోన్ చేయడమంటే మాటలు కాదు. అందులోనూ చేసిన వ్యక్తి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. ఫోన్ చేసిందెవరికి అనుకుంటున్నారా.. విభజనకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహంతికి. ఇంతకీ విషయం ఏమిటంటే.. రాష్ట్ర విభజన పంపకాల గురించి. ఇది రాష్ట్రపతి పాలన నాటి ముచ్చట. విభజన సందర్భంగా భవనాల కేటాయింపు నుంచి సౌకర్యాల కల్పన వరకు అన్నీ గవర్నర్‌ నరసింహన్‌ కనుసన్నల్లోనే జరిగాయి.ఇంకా అప్పటికి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరకపోవడం వల్ల... అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సహకారంతో గవర్నరే పంపకాల ప్రక్రియను గవర్నర్‌ పూర్తి చేశారు. ఈ విషయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు యాక్టివ్ రోల్ పోషించారు. తెలంగాణకు ఎక్కడా అన్యాయం జరగకుండా ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి వెంటపడిన కేసీఆర్‌... అన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. ఆ సందర్భంలోనే ఓసారి గంటన్నర వ్యవధిలో 18 సార్లు ఫోన్‌ చేశారు. మరి పంపకాల విషయంలో... ఆంధ్రప్రదేశ్ నేతలు ఏంచేశారు.. అటు తెలంగాణ నేతలు, ఉద్యోగులు ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తే.. ఏపీ నేతలు, ఉద్యోగులు, అధికారులు మాత్రం వీటి సంగతి పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు, జగన్ పంపకాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయ వ్యూహ రచనల్లో మునిగితేలారు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా అంతే నిర్లిప్తంగా వ్యవహరించారు. ఆనాటి అశ్రద్ధ ఇప్పుడు చంద్రబాబు సర్కారును వేధిస్తోంది. విభజన కారణంగా అస్తవ్యస్థంగా మారిన రాష్ట్రాన్ని సమర్థుడైన రాజకీయ నాయకుడైన చంద్రబాబు గాడిన పెడతాడని ఆశలు పెట్టుకుంటే.. కనీసం సెక్రటేరియట్లోని తన ఛాంబర్ ను కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు సచివాలయాన్ని సందర్శించి.. అవాక్కయ్యారు. తమకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, సిబ్బంది తీరిగ్గా ఇప్పుడు వాపోతున్నారు. చంద్రబాబు ఇకనైనా పాలనపై మరింత దృష్టిపెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: