సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయాక.. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆయన పాలన అప్పుడే నెలరోజులు పూర్తి చేసుకుంటోంది. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్రానికి ఉన్నది ఒక్క సీఎం కాదు.. ఇద్దరు అంటున్నాడో ఎమ్మెల్యే. ఆయన కడప జిల్లా జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ఇంతకీ ఆయన చెబుతున్న ఆ రెండో సీఎం ఎవరో తెలుసా... టీడీపీ ఎంపీ సీఎం రమేశట. సీఎం రమేశ్ ఈమధ్య పార్టీ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నారు. ప్రత్యేకించి.. చంద్రబాబు ఇతనికి ఆపరేషన్ ఆకర్ష బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. కర్నూలు, కడప జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ జంప్ జిలానీలను గుర్తించడం. వారిని పార్టీ మారేందుకు ఒప్పించడం వంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కనీసం పార్లమెంటులో ప్రమాణం కూడా చేయకుండానే ఎస్పీవై రెడ్డి తెలుగు దేశం కండువా వేసుకోవడానికి ఈయన కృషే కారణం. తాజాగా జడ్పీ ఎన్నికలపై కొన్నిరోజులుగా సీఎం రమేశ్ దృష్టిపెట్టి.. వైకాపా నేతలకు వలేసి.. చాలా చోట్ల ఆ విషయంలో విజయం సాధించారు. అందుకే సీఎం రమేశ్ పేరు చెబితేనే వైకాపా నేతలు మండిపడుతున్నారు. ఇక కడప జిల్లా నేతలైతే మరీ.. కడప జిల్లా జమ్మలమడుగులో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోందని... వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామాను తెరకెక్కించిన టీడీపీ నేతలు, శుక్రవారం అధికారుల అండతో శాంతిభద్రతల సమస్యను తెరకెక్కించారంటున్నారు. సీఎం రమేశ్.. అన్నిప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులను భయపెట్టి.. ఆశచూపి లొంగదీసుకుంటున్నాడని.. జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ఒక సీఎం ఉంటే.. కడప జిల్లా వరకూ ఇద్దరు సీఎంలు ఉన్నారని ఒకరు చంద్రబాబయితే.. మరొకరు సీఎం రమేశ్ అని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: