ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది భలే విచిత్రమైన పరిస్థితి. కొత్ర రాష్ట్రమైన తెలంగాణకు రెడీమేడ్ రాజధాని హైదరాబాద్ ఉంటే.. పాత రాష్ట్రంగా చెప్పుకుంటున్న ఏపీకి మాత్రం కొత్త రాజధానిని వెదుక్కోవలసిన పరిస్థితి. ఏపీ కొత్త రాజధాని వేట.. పూటకో మాట.. గడియకో పీకులాటగా మారుతోంది. ఇప్పటివరకూ రాజధానిగా ప్రకటించవచ్చు అని ఆశిస్తున్న నగరాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. మొదట విజయవాడ- గుంటూరు మధ్య అన్నారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా దొనకొండో సర్కారు భూములున్నాయి.. అక్కడ పెట్టొచ్చు అన్నారు. ఈ మధ్య అమరావతి కేంద్రంగా కొత్త రాజధాని ఉంటుందంటున్నారు. ఇంకా విశాఖ, రాజమండ్రి వంటి నగరాల పేర్లూ వినపడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా.. ఆంధ్రరాష్ట్రానికి గతంలో రాజధానిగా ఉన్నకర్నూలు పేరు మాత్రం అంతగా వినిపించడం లేదు. రాయలసీమ పార్టీ పెట్టిన బైరెడ్డి రాజశేఖర్ వంటి వారు కొన్నిరోజులు హడావిడి చేసినా.. అదంతా ఎన్నికలకు ముందే. ఆ తర్వాత ఆయన పోలీసు కేసుల మూలంగా అజ్ఞాతంలోనే ఎక్కువగా గడుపుతున్నారు. గతంలో రాయలసీమ హక్కుల వేదిక వంటి కార్యకలాపాలు నిర్వహించిన టీజీ వెంకటేశ్ వంటి వారు సైలెంటయ్యారు. కొత్త రాజధాని ఎంపిక కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. నేతలు పెద్దగా కలసిరాకపోయినా.. పలువురు రాయలసీమ మేథావులు.. రాయలసీమ రాజధాని సమితి ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన రాయలసీమ రాజధాని సమితి సమావేశానికి పలువురు పలువురు నిపుణులు, విద్యార్థులు, విశ్లేషకులతోపాటు రాజకీయ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజధానికి రాయలసీమ ప్రాంతమే అనువైనదని అభిప్రాయపడ్డారు. తమ ప్రాంతాన్నే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రం రూపుమారిన ప్రతిసారీ సీమకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందన్నారు. రాజధాని విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునేదిని హెచ్చరించారు. ఈ సభలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు పాల్గొనడం ఆసక్తి కలిగించింది. ప్రకాశం జిల్లా రాయలసీమ కిందకే వస్తుందని, అక్కడ లక్షల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నందున దోనకొండను రాజధానిగా చేస్తే బాగుంటుందని కొందరు సూచించారు. శ్రీభాగ్ ఓడంబడిక ప్రకారం కర్నూలుకే రాజధాని దక్కాల్సి ఉందని నీలం సంజీవరెడ్డి మనుమరాలు రాయలసీమ రాజధాని సాధన సమితి మహిళా నేత శైలజ అన్నారు. ఆలస్యంగా మేలుకున్నా మొత్తానికి సీమ వాసులు కూడా రాజధాని రేసులోకి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: