మొత్తానికి లోక్ సభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కనీయకూడదనే నిర్ణయించుకొన్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. కేవలం 44 స్థానాలకు పరిమితం అయ్యి చట్టబద్ధంగా ప్రతిపక్ష హోదాని సాధించుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు స్పీకర్ దయాదాక్షిణ్యాల మీద, కోర్టు మీద ఆశలు పెట్టుకొంది. ఎలాగైనా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ నుంచి సానుకూల స్పందన కనపడటం లేదు. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదనట్టుగా వ్యవహరిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. గతంలో ఇందిరా, రాజీవ్ లు ప్రధానులుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభంజనంలో అన్ని పార్టీలూ వెలవెలబోయాయని, అప్పట్లో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీనే లేకుండా పోయిందని.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ సారి తమ ప్రభంజనం ముందు ఏ పార్టీనూ నిలవలేకపోయిందని.. కాబట్టి కనీస స్థాయిలో సీట్లను సాధించుకోలేకపోయిన కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ విధంగా దక్కుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు! అయితే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోతే లోక్ సభ సమావేశాలకు జరగనిచ్చేది లేదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ హెచ్చరికలను భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. మీకు చేతనైంది చేసుకోండి... కనీస బలం లేని మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించే అవకాశం లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పటికే కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మరి అంతిమంగా ఏం సాధిస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: