విడిపోవాలని ఒక ప్రాంతం వాళ్లు... కలిసుండాలని మరోప్రాంతం వాళ్లు... జిల్లాల సంధుల్లోనే కాదు... ఢిల్లీ వీధుల్లోనూ విభజనకు ముందు వినిపించిన డిమాండ్లివి. మొత్తానికి తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడివడి నెలరోజులు దాటిపోయింది. కానీ నిత్యం ఇరు రాష్ట్రాల మధ్య తగవులు మాత్రం సమసిపోవడం లేదు. సరికదా... ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. ముందునుంచీ ఊహించిన సమస్యలే అయినా... ఆరని నిప్పులా రగులుతున్నాయి. పోలవరం ముంపు మండలాలు, ప్రాజెక్టు నిర్మాణం, క్రిష్ణా జలాలు, విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఉద్యోగుల విభజన, హైదరాబాద్ లో శాంతిభద్రతలు, సచివాలయంలో ఇనుప కంచె... ఇలా ఒకటీ రెండు కాదు... రోజుకొక్కటి చొప్పున వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. అధికారిక విభజనకు ముందు నుంచే అగ్గి రాజేసిన అంశం పోలవరం. ముంపు ప్రాంతమంతా తెలంగాణలో, నీటి ప్రయోజనం పొందే భూములన్నీ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉండడమే ఈ వివాదానికి కారణం. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే ఒడిషా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ముంపు లేకుండా నిర్మాణం మార్చుకోక తప్పలేదు. విభజనకు పూర్వం నుంచీ పోలవరం నిర్మాణాన్ని తెలంగాణవాదులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న తరుణంలో సీమాంధ్రలో పోలవరం నిర్మాణానికి సహకరించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ముంపుకు గురికానున్న ప్రాంతాలతోపాటు మొత్తం ఖమ్మం జిల్లాలోని 9 మండలాలనూ ఆంధ్రప్రదేశ్ లో కలపాలని నిర్ణయించింది. అయితే ఆదినుంచీ దీన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముంపు మండలాలను కలిపే ఆర్డినెన్స్ ను అడ్డుకోవడానికి పార్లమెంటును వేదిక చేసుకోనుంది. దాంతోపాటు నిర్మాణంను మార్చి ముంపు ప్రాంతాన్ని తగ్గించాలనే డిమాండ్ నూ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో విలీనం పై ముంపు గ్రామాల్లోనూ వ్యతిరేకత ఉన్నందున చివరికి ఏం జరుగుతుందో మరి... మా విద్యార్థులకే మేం బోధన రుసుములు చెల్లిస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటన కూడా ఇరు రాష్ట్రాల మధ్య మరో చర్చకు తెరతీసింది. దీనికి ధీటుగా మా విద్యార్థులకు మాత్రమే మేము స్కాలర్ షిప్ చెల్లిస్తాం అని ఏపీ సర్కారూ తేల్చి చెప్పింది. ఎవరికి వాళ్లిచ్చుకుంటే బాగానే ఉంది... కానీ ఏ విద్యార్థులు ఎవరి వాళ్లు అనేది తేల్చడం ఎలా అన్న దగ్గరే పంచాయితీ మొదలైంది. స్థానికత నిర్ధారణ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు 20 రోజులుగా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా... కొద్ది శాతం తెలంగాణ విద్యార్థులు కూడా ఆంధ్రలో చదువుతున్నారు. పాఠశాల స్థాయి నుంచి కొనసాగిన చదువు ఆధారంగా చేసుకోవాలా... లేకుంటే తల్లిదండ్రులు పుట్టిన ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలా... 1956 కు ముందు ఎటువైపు ఉన్న వాళ్లు అటు వైపే అనుకోవాలా... ఇలా సవాలక్ష కోణాల్లో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం చూచాయగా అన్నట్లు 1956 కు ముందు నుంచీ ఉన్నవాళ్లే స్థానికులు అంటే మాత్రం... ఆ తర్వాత తెలంగాణలో కలిపిన భద్రాచలం, నల్గొండ జిల్లాలోని మునగాల పరగణా వాసులు మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదు. తెలుగు నేలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన క్రిష్ణాజలాల కోసమూ రెండు రాష్ట్రాల మధ్య తన్నులాట తప్పడం లేదు. ఇది ముందు నుంచీ ఊహించినదే అయినా... విడిపోయిన తొలి సీజన్ లోనే కరువు కోరలు చాచడంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కుడి, ఎడమ కాల్వల రైతాంగాన్ని బతికింంచింది గతకాలంలో నాగార్జున సాగరం. అడుగంటిన నీటి కోసమే ఇరు రాష్ట్రాలూ ఆశపడుతున్న పరిస్థితి వర్తమానానిది. మరి భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో... క్రిష్ణా బేసిన్ లో తాగు నీటి అవసరాల కోసం 3.6 టీఎంసీల నీటిని వారం రోజులపాటు దశలవారీగా విడుదల చేయాలని క్రిష్ణాబోర్డు చెప్పింది. విడుదలైన నీరు చేరుకునేలోపే ఆవిరయ్యాయని... మరో వారం విడుదలను పొడిగించింది. కాకమ్మ కబర్లు చెప్తున్నారంటూ ఆగ్రహించిన తెలంగాణ ప్రభుత్వం... కారాలు, మిరియాలూ నూరుతోంది. ఇప్పటికే కనిష్టంగా 513 అడుగులకు చేరిన సాగర్ నీటిని సంరక్షించుకోకుంటే... హైదరాబాద్ వాసులకూ తాగునీటి కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని గందరగోళ పరిస్థితుల మధ్య బిరబిరా క్రిష్ణమ్మ పరుగులు తీసి, వరద నీరు సాగరాన్ని చేరితేనే తప్ప... సమస్యలు తీరిపోవు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న గోదావరి పంచాయితీ సైతం ముందు ముందు మరింత ముదురుతుందేమో... ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు జగద్విదితమే. ఆప్షన్లు వద్దని కొందరు, ఉండాల్సిందేనని మరికొందరు వాదిస్తున్నారు. ఎక్కడి వాళ్లు అక్కడికే వెళ్లాలని... కాదని కొనసాగితే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రం కలుగజేసుకుంటున్నా ఇక్కడా కిరికిరి చల్లారేలా కనిపించడం లేదు. సచివాలయంలో వేసిన ఇనుప కంచె సైతం చిన్నపాటి మాటల యుద్ధమే చేయించింది. సెక్రటేరియట్ ఏమైనా పాకిస్థాన్ బోర్డరా అంటూ టీడీపీ ప్రభుత్వం నోరెత్తగానే... గవర్నర్ వేశారు తప్ప మాకు సంబంధం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఘాటుగానే సమాధానం చెప్పింది. చివరికి మేం వేయలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పినా... జారీ చేసిన ఆదేశాలను టీ ప్రభుత్వం బయటపెట్టింది. ఇక ఇది కూడా పోతే... తాజాగా హైదరాబాద్ లో శాంతిభద్రతల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తెలంగాణలో పోలీసు శాఖ ప్రక్షాళనకు నడుం కట్టిన కేసీఆర్... ఆ ప్రక్రియకు హైదరబాద్ నుంచే శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ప్రక్షాళన ప్రారంభించిన మొదట్లో నోరు మెదపని... టీడీపీ ప్రభుత్వం తాజాగా ప్రధానికి లేఖ రాసింది. హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో ఇరు ప్రభుత్వాల ప్రమేయం ఉండాలనేది లేఖ సారాంశం. వెంటనే స్పందించిన కేంద్రం... ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు అధికార దండం అందించేలా నిబంధనలు సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఇందుకు ఒప్పుకునేది లేదని కేసీఆర్ తెగేసి చెప్పారు. ఈ వివాదం మున్ముందు ఏ తీరానికి చేరనుందో... విడిపోయి నెలరోజులు పూర్తికాక ముందే ఇన్ని తగవులు నెలకొంటే... మున్ముందు ఇరు రాష్ట్రాల మధ్య మరెన్ని వివాదాలు పొద్దు పొడవనున్నాయో... తెలుగు ప్రజానీకాన్ని ఏ వైపుకు నడపనున్నాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: