ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి మంత్రి మండలిని ఏర్పాటుచేస్తానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రస్తుత మంత్రి మండలిలో మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిథ్యం లేని విషయం పాఠకులకు విదితమే. సెప్టెంబర్‌ మాసంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో జరిగిన ''తెలంగాణ పునరావిష్కరణ'' (రీ- ఇన్వెంటింగ్‌ తెలంగాణ) సదస్సులో ముఖ్య మంత్రి పై విషయాలను వెల్లడించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఒక ఉపాధ్యాయుడిగా మారారు. మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ సలహాదారులు, శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు (హెచ్‌ఒడి) విద్యార్థులుగా అవతారమెత్తారు. నిర్థారిత కార్యక్రమం ప్రకారం ముఖ్యమంత్రి ఒక గంట ప్రసంగానంతరం టీ బ్రేక్‌ వుండాలి. కానీ, ఆయన రెండున్నర గంటల పాటు ఏకబిగిన పలు అంశాలను పూసగుచ్చినట్లుగా మంత్రివర్గ సహచరులకు, అధికారయంత్రాంగానికి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లకు తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.  తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిష్కరణ అనంతరం పాతధోరణితోనే, పాతపద్ధతిలోనే పరిపాలన సాగిస్తే ప్రజలకు న్యాయంచేసిన వారంకాదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుకు చాలా ప్రత్యేకత వుందని, తెలంగాణ రాష్ట్ర నూతన ప్రస్తావనకు నాంది పలుకుతున్న రోజు అని చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. ఆయన ప్రసంగం యావత్తు అట్టే అందరిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం టీ బ్రేక్‌కు బదులు లంచ్‌ బ్రేక్‌ జరిగింది. అవసరమైతే నేడు రోజు మొత్తం జరగాల్సిన సదస్సును మరో పూట పొడిగించుకుందామని చెప్పారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం : రైతులకు లక్ష రూపాలయ రుణాలమాఫీపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతు రుణమాఫీని వందశాతం అమలు చేస్తామని, దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సలహా మండలిని కూడా మరో వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని రంగాలకు చెందిన నిపుణులు, మేధావులను ఈ మండలిలో భాగస్వాములను చేస్తామని ఆయన తెలిపారు.  తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం ఈ మండలి సూచనలు సలహాలను కూడా తీసుకుంటామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య పెంచుకోవాల్సిన అవరం వుందని సిఎం అన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ త్వరలోనే చేపడుతామని కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఎన్ని జిల్లాలు అవసరమో సమగ్రమైన నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా గ్రామీణ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న 'అపార్ట్‌' పేరుతో ఉన్న సంస్థ పేరు మార్చుతామని సిఎం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి అపార్డ్‌ను మంగళవారం సందర్శించి అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలను సమీక్షిస్తామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: