కర్నూలు రాజధాని అనేది నినాదం కాదని, తమ హక్కు అని జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీ నేతలు, విద్యావంతులు, మేథావులు ముక్త కంఠంతో శివరామకృష్ణ కమిటీ ఎదుట నినదించారు. కర్నూలు రాజధాని కాకుంటే మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా కర్నూలు రాజధాని చేయాలనే తమ ఏకైక డిమాండ్‌ను అందరూ ముక్తకంఠంతో వెల్లడించారు. రాజధాని ఏర్పాటు అంశాలను పరిశీలించేందుకు శివరామకృష్ణ కమిటీ సోమవారం కర్నూలుకు వచ్చింది. తొలుత నగరంలోని వివిధ పురాతన చారిత్రాత్మక స్థలాలను (నాటి అసెంబ్లీ, ఎమ్మెల్యే గృహాలు) తదితర ప్రదేశాలను వారు పరిశీలించింది. అనంతరం కలెక్టరేట్‌ చేరుకున్న కమిటీ సభ్యులు సునయన ఆడిటోరియంలో వినతి పత్రాలను స్వీకరించారు. అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి, వైసిపి, బిజెపిి, కాంగ్రెస్‌, రాయలసీమ రాజధాని సమితి సభ్యులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. కర్నూలు వాసులు రాజధాని నగరాన్ని త్యాగం చేసి ఎంతో కోల్పోయారన్నారు. అన్ని అర్హతలున్న కర్నూలును రాజధాని చేయాలని కోరారు. శివరామకృష్ణ కమిటీ మరో శ్రీకృష్ణ కమిటీ కారాదన్నారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని, అయితే మీరెందుకు ఇలా విచారణ చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో రాజధానికి అవసరమైన 30 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, తాగు నీరుకు అవసరమైన నదులు ఉన్నాయని తెలిపారు. కోస్తాను రాజధానిగా చేస్తే వరదలు, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని, రాజధానికి అవసరమైన అన్ని అర్హతలు కర్నూలుకే ఉన్నాయని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కె.యి ప్రభాకర్‌, వైసిపి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మణి గాంధీ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గౌరు చరిత, బుడ్డా రాజశేఖర రెడ్డి, ఐజయ్య, బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి, రాయలసీమ జెఎసి నాయకులు శర్మ తదితరులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులు అరోమర్‌ రవి, జగన్‌ షా, కె.టి రవీంద్రన్‌, కె.నితిన్‌ మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుపై తాము ఆగస్టు 31లోగా కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భూముల విషయం నివేదికలో తెలియజేస్తామన్నారు. తాము అన్ని జిల్లాలో తిరిగి అన్ని పార్టీలు, ప్రజలు, మేధావుల అభిప్రాయాలు తెలుసుకొని నివేదిక అందజేస్తామని, రాజధాని ఏర్పాటు నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: