ఆంధ్రప్రదేశ్‌ నారా చంద్రబాబు నాయుడు నెలరోజుల పాలన తెలుగు ప్రజానీకాన్ని ఏ మాత్రం తృప్తినివ్వలేకపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణ సర్కారు కంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రగతి నివేదికలో వెనుకబడినట్టు కనిపిస్తోందని పరవిశీలకులు అంటున్నారు. గులాబీ దళపతిలా పసుపు పార్టీ నేత దూకుడును ఎందుకు ప్రదర్శించలేక పోతున్నారు? ఎక్కడుంది లోపం? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు చంద్రబాబు పాలన వేగం లేని విధానంతోనే సరిపెట్టుకుంటోందా? అనే చర్చ అంతటా ప్రారంభమైంది. గత ముప్పయి రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఒక్కటి కూడా జనం మన్ననలు పొందిన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయిందని అంటున్నారు. ఢిల్లీ చేతిలో వున్న రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం అంటూ గతంలో కాంగ్రెస్‌ పాలకులను చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పుడు పదేపదే కేంద్ర సాయం కోసం ఎందుకు అర్రులు చాస్తున్నారు? ఒక్క నెలలో రెండుసార్లు హస్తిన వెళ్లివచ్చినా కీలక నిర్ణయాలేవీ వెలువడలేదెందుకు? ఇంతకూ రాష్ట్ర రాజధాని ఎక్కడ పెడుతున్నారు? విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీ. సర్కార్‌ తీసుకున్న నిర్ణయాల్ని టీడీపీ ప్రజాప్రతినిధులు ఎందుకు సవాల్‌ చేయలేకపోయారు? సాగునీటి అవసరాల మాట అటుంచితే, కనీసం తాగునీటిని అందిద్దామన్నా అడ్డుపడ్డ కేసీఆర్‌ ప్రభుత్వంపై చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్కరూ ఎందుకు నోరు మెదపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయ్యప్ప సొసైటీ భూములపై ఇష్టానుసారం కూల్చివేతలు సాగుతున్నా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో బయటపెట్టడం లేదని అంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌పై మమకారం చంపుకోకుండా వుండటం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందనే వారూ లేకపోలేదు. వీలైనంత తొందరగా రాజధానిని గుర్తించి నవ నగర నిర్మాణానికి రాళ్లెత్తాల్సిందనే అభిప్రాయాన్ని సీమాంధ్ర ప్రజలు అభిప్రాయంగా వుంది. ఇప్పటికిప్పుడు రాజధానిని వెతుక్కోవడం అంటే మాటలు కాదనే అభిప్రాయం వుంది. హైదరాబాద్‌ రెవెన్యూపై మాట మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు. ఎపి ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి వైఖరిని ప్రకటించలేదు. నీళ్ల వాటా కూడా ఏమిటో తేల్చలేదు, కరెంటు కష్టాలూ వున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు లెక్క తేల్చాల్సిన అంశాలు అనేకం వున్నాయి.చివరికి తెలుగు యూనివర్సిటీని తెలంగాణలో కలిపేసుకుంటామంటూ టీ .మంత్రి ప్రకటించినా ఇదేమిటని అడిగే నాథుడు లేడని విమర్శలున్నాయి.  అన్నింటికీ మించి ఏమీ లేకపోయినా మేం ఎదగగలం అనే ఆత్మ విశ్వాసం ముఖ్యం. అది చంద్రబాబు దగ్గర కనిపించాలని ఆ ప్రాంత మేధావులు అంటున్నారు. తక్షణం రాజధాని బదలాయింపు జరగాలరు డిమాండ్‌ వున్నా చంద్రబాబు స్పందన నామమాత్రమేనని అభిప్రాయం లేకపోలేదు. గుడారాలు వేసి పిలిచినా చాలు మేం వచ్చేస్తాం అని రాష్ట్ర ఉద్యోగులే ముందుకు వచ్చారు. మరి చంద్రబాబు మీనమేషాలు లెక్కించడం సరికాద నే అపవాదు వుంది. కర్తవ్యాన్ని గుర్తుచేసుకుని నిదానంగా అడుగులు వేయకుండా ముందుకు కదలాలలనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలనుంచి వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: