చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందువరకు వీలయినంత త్వరగా ప్రభుత్వాన్ని విజయవాడ-గుంటూరు మధ్యకు మార్చేయబోతున్నట్లు చాలా స్పష్టమయిన సంకేతాలు పంపారు. వారంలో మూడు రోజులు ఆంధ్రాలో, రెండు రోజులు హైదరాబాదులో ఉండబోతున్నట్లు తెలిపారు కూడా. కానీ, ఆ తరువాత మరేమయిందో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన హైదరాబాదునువదిలి బయటకు రానేరావట్లేదు. ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయిన ఆయన ఆంధ్రాలో కాలే పెట్టడమే లేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో తన క్యాంప్ కార్యాలయం నుండే పరిపాలన సాగిస్తున్నారు. ఇక సచివాలయంలో మంత్రులకు చాంబర్లు కేటాయించినప్పటికీ, ఒకరో ఇద్దరో తప్ప మిగిలినవారెవరూ కూడా అక్కడికి వెళుతున్న దాఖలాలు లేవు. ఈ నేపధ్యంలో రాష్ట్రపరిపాలన చాలా అస్తవ్యస్తంగా మారడంతో మిత్రపక్షాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి పరిపాలనా దక్షుడని పేరుగాంచిన చంద్రబాబు నాయుడు అధికారం చేప్పట్టి నెలరోజులవుతున్నా ఇంకా తన మార్కు పరిపాలన మొదలుపెట్టకపోవడం ప్రజలు కూడా క్రమంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఎటువంటి పాలనానుభావము లేని కేసీఆర్ తొలిసారిగా తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టినప్పటికీ, ఊహించిన దాని కంటే చాలా వేగంగా చకచకా పాలనా వ్యవహారాలూ చక్కబెట్టేస్తుంటే, ఎంతో అనుభవజ్ఞుడు, పరిపాలనాదక్షుడని పేరు పొందిన చంద్రబాబు అసలు పని మొదలు పెట్టారా లేదా? అని మిత్రపక్షానికి చెందిన బీజేపీ యంపీ కంబంపాటి హరిబాబు ప్రశ్నిస్తున్నారంటే ప్రజలు ఎంత అసహనంగా ఉన్నారో అర్ధమవుతోంది. చంద్రబాబు పరిపాలనపై ఆయన ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసారు. హైదరాబాదులో కూర్చొని ఇడ్లీలు తింటూ తెలంగాణా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే బదులు అదేదో ఆంధ్రాకు వచ్చేస్తే బాగుంటుంది కదా? ఈ నెల రోజులలో పాలనలో మెచ్చుకోదగ్గ అంశాలేవీ నాకు కనబడలేదు,” అని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక మాజీ కేంద్రమంత్రి కావూరి సాంభశివారావు కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయామే వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ కు దూరంగా హైదరాబాదులో ఉండి పరిపాలన చేయడం ఏ మాత్రం సరికాదని, అందువల్ల వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు వంటివాటినన్నిటినీ ఆంధ్రాకు తరలించాలని ఆయన సూచించారు. గతంలో మద్రాసు నుండి ఆంద్ర విడిపోయినప్పుడు తాత్కాలికంగా షెడ్లు వేసుకొని పరిపాలన సాగించారని, ఇప్పుడు కూడా అవసరమయితే షెడ్లు వేసుకోనయినా ఆంధ్రా నుండే పరిపాలన సాగించాలని కోరారు. కానీ ఇంతకూ చాలా ఉత్సాహంగా ఉన్న చంద్రబాబు ఇంతకీ ఎందుకు అంత చల్లబడిపోయారు? పంట రుణాల మాఫీ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నందునా? లేక శివరామ కృష్ణ కమిటీ రాజధానికి వేరే ప్రాంతం సూచించడం వలనా? లేక వేరే ఇతర కారణాలేమయినా ఉన్నాయా? అనేది తెలియవలసి ఉంది. ఇంతవరకు మంత్రులు కూడా చురుకుగా పరిపాలనా వ్యవహారాలను చూస్తున్నట్లు కనబడటం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే ప్రజలు కూడా ఇటువంటి విషయాలను అంతగా పట్టించుకొనేవారు కారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా వేగంగా, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఇంచుమించుగా ఒకేసమయంలో అధికారం చెప్పట్టినందున, ప్రజలు రెండు ప్రభుత్వాల, మంత్రులు, ముఖ్యమంత్రుల పనితీరును పోల్చిచూసుకొంటున్నారు. తెలంగాణా ప్రభుత్వంతో పోలిస్తే ఆంద్ర ప్రభుత్వం మన్ను తిన్న పాములా పడి ఉన్నట్లు కనబడుతోంది. అందువల్ల చంద్రబాబు ఇకనయినా జూలు విదిలించి రంగంలో దిగినట్లయితే. యదా రాజ తదా ప్రజా అన్నట్లు మంత్రులు కూడా పనిచేయడం మొదలుపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: