విభజన పూర్తయి నెలరోజులు దాటినా ఇంకా సచివాలయంలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఏపీ, తెలంగాణ రెండు సచివాలయాల్లోనూ ఇంకా ప్రాధమిక సమస్యలైన ఫర్నిచర్, మౌలిక సదుపాయాలు కూడా సమకూరలేదు. మొన్నటే సెక్రటేరియట్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. పరిస్థితి చూసి అవాక్కైన సంగతి తెలిసిందే. సాధారణ పరిస్థితి నెలకొనడానికి.. ఉద్యోగులు తమ పని తాము చేసుకోవడానికి ఇంకా కనీసం 3 నెలలు సమయం పడుతుందని అధికారులు చంద్రబాబుకు తేల్చిచెప్పారు కూడా. ఆయన కూడా గతంలోలాగా.. ఉద్యోగులపై మండిపడకుండా..కానీయండి చేసేదేముంది... కానీ కాస్త త్వరగా తెల్చండి అని చెప్పేసి వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా.. ఫర్నిచర్ కోసం తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య గొడవల మొదలైంది. తెలంగాణ సచివాలయంలోని డీ బ్లాక్‌లోని రెండో అంతస్తులో పరిశ్రమల శాఖ ఉంది. వివిధ విభాగాల్లో శనివారం సాయంత్రం వరకు ఉన్న ఫర్నీచర్ సోమవారం ఉదయం కనిపించలేదు. కంప్యూటర్లు, కుర్చీలు, అల్మారాలు అన్నీ కనిపించకుండా పోయాయి. ఏమయ్యాయని ఆరా తీస్తే.. అవి తమ వాటాకిందకు వస్తాయని సీమాంధ్ర ఉద్యోగులు తీసుకెళ్లినట్టు తెలిసింది. ఫ్లోర్‌లో శాశ్వతంగా సెటప్ చేసిన ఫర్నీచర్‌ను కూడా సీమాంధ్ర ఉద్యోగులు ఊడదీసి తీసుకెళ్లారని టీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు మాత్రం తమ వాటాకు వచ్చిన వాటినే తీసుకొచ్చాం తప్ప.. ఒక్కటి కూడా అదనంగా తీసుకురాలేదని వివరణ ఇస్తున్నారు. ఈ విషయం మీదు ఇరు ప్రాంత ఉద్యోగులు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయాన్ని జీఏడీ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలంగాణ పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ వీ సైదా మీడియాకు చెప్పారు. విభజన నియమాల ప్రకారం.. బిగించిన ఏ పరికరాన్ని, ఫర్నీచర్‌ను తొలగించరాదని, ఎక్కడికీ తరలించరాదన్న నిబంధన ఉందని... దాన్ని సీమాంధ్ర ఉద్యోగులు పాటించలేదని.. టీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మొత్తం సచివాలయం విభజన ప్రక్రియలో తమకే అన్యాయం జరిగిందని.. రెండు ప్రాంతాల ఉద్యోగులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: