జూన్ 2.. సమైక్య ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రెండు రాష్ట్ట్రాలుగా ఏర్పడిన రోజు.. ఇది జరిగి నెలరోజులు కావస్తోంది. అయినా.. ఇంకా కేంద్రప్రభుత్వ వర్గాలు తమ తీరు మార్చుకోవడం లేదు. పరిపాలనాపరమైన లేఖల్లో.. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయాల్లో తప్పులు చేస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు సీఎంలు, రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎవరి పనులు వారు చక్కబెట్టుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. ఇంకా ఈ విభజనను పూర్తిగా ఒంట బట్టించుకోని వారూ ఉన్నారు. ఇదేదో అప్ డేట్ కాని ప్రభుత్వ వెబ్ సైట్ల సంగతి కాదండోయ్.. అత్యంత కీలకమైన కేంద్రప్రభుత్వ శాఖల గురించి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సురేశ్‌కుమార్ ఈ నెల 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన ఉత్తర్వుల్లో కేంద్ర అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన మెమోలో డాక్టర్ రాజీవ్‌శర్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారు. హోంమంత్రిత్వ శాఖలో ఉన్న సురేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడంతో పాటు రాష్ట్ర విభజన ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవహరించారు. గతంలో కేంద్రం హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి వెంట హైదరాబాద్‌కు కూడా వచ్చారు. పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు ప్రతులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి స్వయంగా అందజేసింది కూడా సురేశ్‌కుమారే. అలాంటి వ్యక్తి పేరిట వచ్చిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖలో ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ జరగడం విశేషం. ఇలా జరగడం ఇదే మొదటి సారి కూడా కాదు. గతంలో.. బొగ్గు మంత్రిత్వ శాఖ జూన్ 16న నిర్వహించిన ఓ సమావేశం గురించిన సమాచారాన్ని పంపండంలోనూ ఇదే తరహా నిర్లక్ష్యం జరిగింది. అప్పుడైతే అసలు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా పంపలేదు. మీటింగ్ తో సంబంధం ఉన్న 11 రాష్ట్రాలకు ఫాక్స్ ద్వారా పంపారు. బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పేరుతో జూన్ 5వ తేదీన రూపొందించిన ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వచ్చింది. కేంద్రప్రభుత్వ అధికారులు ఇంకెప్పుడు మేలుకుంటారో..

మరింత సమాచారం తెలుసుకోండి: