సినిమాల ద్వారా తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీని దశాబ్దాలు ఏకచ్ఛత్రాధిపత్రంగా ఏలిన హీరో చిరంజీవి.. తెలుగునాట ఎన్టీఆర్ తర్వాత.. అంతటి స్టార్ డమ్ చిరంజీవికే సొంతం. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అలాంటి చిరంజీవి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి కనీసం అందులో పదోవంతు స్థాయి విజయాలు కూడా అందుకోలేకపోయారు. భారీ అంచనాలతో ప్రజారాజ్యం స్థాపించి.. కొన్నాళ్లకే దుకాణం కట్టేశారు. కాంగ్రెస్ లోకి జంప్ చేసి.. ఏకంగా కేంద్రమంత్రి అయిపోయినా పెద్దగా.. అదీ మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. చివరకు కాంగ్రెస్ కు ఏపీలో కనీసం ఒక్క మండల పరిషత్ కూడా దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ తలచుకుంటేనే ఆ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్టీకి మంచిరోజులు కనుచూపుమేరలో కనిపించడం లేదు. దీంతో చిరంజీవికి నైరాశ్యానికి లోనవుతున్నారు. సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు సెంటిమెంట్స్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పనిలో ఉన్నారట. పొలిటికల్ గా చిరంజీవి గ్రాఫ్ ఇంత దరిద్రంగా ఉండటానికి కారణమేంటా అని ఓ న్యూమరాలజిస్ట్ ను ఆరా తీస్తే.. ఆయన అంతా ఆశ్చర్యపోయే విషయం బయటపెట్టాడు. చిరంజీవిని షార్ట్ కట్ లో మీడియా చిరు.. చిరు.. అని రాయడం మామూలే. ఐతే.. ఇదే చిరంజీవి కొంప కొల్లేరు చేసిందట. చిరు అనే పేరులోనే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయట. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. చిరంజీవి అని పిలిపించుకుంటేనే మంచిజరుగుతోందట. చిరు అని పిలిపించుకున్నా.. సంభోదించినా.. మీడియాలో చిరు అని రాసినా.. చిరంజీవికి అంత శుభం కాదట. మీడియా పదే పదే చిరు అని రాయడమే తన తలరాత మార్చిందని మెగాస్టార్ భావించారో ఏమో కానీ.. ఇకపై చిరు అను మీడియాలో రాయవద్దని ఆయన కార్యాలయం నుంచి మీడియా కేంద్రాలకు ఫోన్లు వెళుతున్నాయి. ఇకపై పూర్తిగా చిరంజీవి అని రాయండి అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: