పోలవరం... రాష్ట్ర విభజనకు ముందు నుంచీ వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ భారీ భవిష్యత్ ప్రాజెక్టు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి మొదలై... ఇప్పుడు ఇరు రాష్ట్రాల పంచాయితీగా మారి కూర్చుంది. అంతకు ముందు ఈ పోలవరం విషయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు ఒడిషా, ఇటు చత్తీస్ గఢ్ రాష్ట్రాలతోనూ కోర్టుకెక్కక తప్పలేదు. ఇన్ని వివాదాలకు మూల బిందువుగా ఉంటున్న పోలవరం నిర్మాణం ఆటంకం లేకుండా సాగడం కోసం పోయిన యూపీఏ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడంతోపాటు... ముంపు మండలాలతోపాటు వాళ్లకు పునరావాసం కల్పించే అవకాశం ఉన్న ప్రాంతాన్ని సీమాంధ్రలో కలుపుతామని ప్రకటించింది. ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదులు... కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వానికి ఇదే అంశంపై సభలో నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఆర్డినెన్స్ బిల్లు రూపంలో తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే టీ ఎంపీల నిరసన తెలుపుతుండగానే... ఆర్డినెన్స్ బిల్లును సభలో పెట్టడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఇంతకూ బిల్లు ఎందుకు ఆపారన్నది మాత్రం వివరంగా ఎవ్వరూ చెప్పలేదు. తమ నిరసన కారణంగానే సభలో బిల్లు పెట్టకుండా అడ్డుకున్నామని టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని చెప్పారు. సాంకేతిక కారణాలతో బిల్లును నిలపేశామని... రెండ్రోజుల్లో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కాదు... కాదు... ఇవేవీ కావు... మరో నాలుగు గ్రామాలను అధనంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలపాల్సి ఉన్నందునే బిల్లు వాయిదా పడిందని ఏపీ టీడీపీ ఎంపీలు అంటున్నారు. పోలవరం పూర్తి కావాలంటే మరో నాలుగు గ్రామాలు ఏపీలో కలపాల్సిందేనని వారు చెప్పారు. ఎవరికి తోచిన ప్రకటన వాళ్లు చేయడంతో... అసలు బిల్లు ఎందుకు ఆగిందోనన్న గందరగోళానికి తెరపడకుండా పోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: