కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా ఉంది సీమాంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల నిర్వాకం. రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు రైతులకు ప్రమాదకరంగా మారింది. రుణమాఫీ జరుగుతుందన్న ఆశతో ఉన్న రైతులకు ఈ ఖరీఫ్ లో కొత్త ప్రమాదం ముంచుకొస్తోంది. ప్రతియేటా ఉన్న పంటల ఇన్సూరెన్సుకు కూడా వాళ్లు దూరం అయ్యేలా ఉన్నారు. ప్రతియేటా ఖరీఫ్ విత్తనానికి ముందే రైతులు బ్యాంకుల్లో రుణాలను రీషెడ్యూల్ చేస్తారు. వడ్డీలు చెల్లించి లోన్ ను రెన్యువల్ చేస్తారు. ఈ విధంగా రెన్యువల్ చేయడం ద్వారా వాళ్లు పంటల ఇన్సూరెన్స్ కు అర్హత పొందుతారు. పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం కలిసి నష్టపరిహారం చెల్లిస్తాయి. అయితే ఈ పద్ధతికి ఈ సారి కి బ్రేక్ పడినట్టే! బ్యాంకులకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది అనుకొంటున్నారు రైతులు. ప్రతియేడాదీ జూన్, జూలైలలో రెన్యువల్ చేసే రైతులతో బ్యాంకులు కిటకిటలాడేవి. అయితే రెన్యువల్ చేస్తే తమ రుణాలు ఎక్కడ రద్దుకావోనని భయపడుతున్న రైతులు వడ్డీలు కూడా చెల్లించడం లేదు! అసలు బ్యాంకుల గడపతొక్కడానికే ఇష్టపడటం లేదు. ఎక్కడ రెన్యువల్ చేస్తే మాఫీ జరగదేమో అనే భయంతో రైతులు బ్యాంకులవైపు చూడటం లేదు! దీని వల్ల వాళ్లకు క్రాప్ ఇన్సూరెన్స్ లు వర్తించే అవకాశం ఉండదు. వడ్డీలు చెల్లించకపోవడం వల్ల వాళ్లకు ఆ అర్హత కోల్పోతారు. మరి ఈ సారి పంట దక్కకపోతే ప్రభుత్వం కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ బీమా చెల్లించే అవకాశాలు ఏ మాత్రం ఉండవు. ఈ విధంగా రైతులు రుణమాఫీ హామీ పుణ్యనా భారీగానే నష్టపోయేలా ఉన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: