రైతు రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం, ఇంటికో ఉద్యోగం... ఇవి కాదు అంటే, ఇంటికో కంప్యూటర్ , మనిషికో సెల్ ఫోన్ వంటి ఎన్నికల హామీలను విన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అధికారాన్ని సాధించుకొంటున్నాయి. అయితే వీటన్నింటికీ భిన్నమైన హామీలను ఇస్తున్నారు హర్యానా రాజకీయ నేతలు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి ఆసక్తికరమైన హామీలను ఇస్తున్నారు. అలాంటి వాటి ముఖ్యమైనది యువకులకు పెళ్లి సంబంధాలను తెస్తామని అనడం. తమకు ఓటేసి గెలిపిస్తే.. నియోజకవర్గంలో పెళ్లికిఎదిగిన కుర్రాళ్లకు సంబంధాలను తీసుకొస్తామని అక్కడి రాజకీయ నేతలు హామీఇస్తున్నారు! ఈ హామీనే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తుందని అక్కడి నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలు ఈ హామీని ఇస్తున్నారు. హర్యానాలో స్త్రీ పురుష నిష్ఫత్తి చాలా దారుణమైన స్థితిలో ఉంది. అక్కడ వెయ్యిమంది మగవాళ్లకు 850 మంది ఆడవాళ్లున్నారు. ఈ వ్యత్యాసంతో అక్కడ చాలా మంది కుర్రాళ్లకు పెళ్లి కాకుండా పోతోంది! మరి ఇలాంటి పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు. తమకు ఓటేసి గెలిపిస్తే.. బీహార్ నుంచి పెళ్లి సంబంధాలు తీసుకొస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు. ఎలాగూ హర్యానాలో అమ్మాయిలు దొరికే అవకావం లేదు కాబట్టి.. బీహార్ నుంచి సంబంధాలు తెప్పిస్తామని వారు చెబుతున్నారు. బీహారే ఎందుకంటే.. అక్కడ బీజేపీ బలంగా ఉంది కాబట్టి.. సులభంగా సంబంధాలను తీసుకురావడానికి అవకాశం ఉందని హర్యానా నేతలు చెబుతున్నారట. మరి ఈ హామీ వారిని గట్టెక్కుస్తుందో లేదో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: