గురుకుల్ ట్రస్టు,అయ్యప్ప సొసైటీ, గోకుల్ ఫ్లాట్స్ ప్రాంతాలలో ఇళ్ల కూల్చివేత కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం ఆపివేసినట్లేనా?అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇళ్లు కూల్చిన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి.ఇది కక్షతో జరిగిన పని అని విపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విమర్శించింది, తెలుగుదేశం ఆ నియోజకవర్గంలో గెలిచింది కాబట్టి టిఆర్ఎస్ నాయకత్వం ఈ పని మొదలు పెట్టిందని కొందరు ఆరోపించారు.అయితే తమ ఉద్దేశం అది కాదని, అక్రమ కట్టడాలు ఎక్కడా ఉన్నా అరికట్టాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే దీని ఆధారంగా సీమాంద్రులను లక్ష్యంగా చేసుకుని ఇళ్లు కూల్చుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఈ పరిణామాలు ఇలా ఉండగా,టిఆర్ఎస్ నేతలు కొందరు కెసిఆర్ ను కలిసి ఇలాంటి తొందరపాటు చర్యలు వద్దని సూచించారని సమాచారం మొదటే ఇలాంటి వివాదాస్పద చర్యల వల్ల కొత్త సమస్యలు వస్తాయని కెసిఆర్ తో అన్నారు.కొంత సంయమనం తో వెళ్లాలని కోరారని అంటున్నారు.ఆయా నేతల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్న కెసిఆర్ తాత్కాలికంగా కూల్చివేతలను నిలిపివేయడానికి ఒప్పుకున్నారని చెబుతున్నారు.కారణం ఏదైనా గత రెండు,మూడు రోజులుగా కూల్చివేతలు నెమ్మదించింది మాత్రం వాస్తవంగానే కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: