రైల్వే బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు రెడ్ సిగ్నల్ పడింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రసంగంలో కొత్త రైల్వే లైన్లు సంగతి అసలు ఊసే ఎత్తలేదు. కొత్త ప్రాజెక్టుల్లో కూడా రెండు రాష్ట్రాలకు అవకాశం దక్కలేదు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఏపీలో కొత్త రైల్వే జోన్ పై సంగతే పట్టించుకోలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో 29 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని..వాటిని 20 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మోడీ సర్కార్ మొదటి రైల్వే బడ్జెట్ లోనూ మనకు తీరని అన్యాయం జరిగింది. కొత్త రైళ్లు, లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ..రైల్వే జోన్ పై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఎవో కొన్ని ట్రైన్లను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. నాగపూర్-సికింద్రాబాద్, చెన్నై-హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు, సికింద్రాబాద్-నిజాముద్దీన్ మధ్య ప్రీమియం రైలు, విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు, పారదీప్-విశాఖల మధ్య ఎక్స్ ప్రెస్, విజయవాడ-ఢిల్లీ మధ్య ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రకటించారు. రైల్వే బడ్జెట్ లో రెండు రాష్టాలకు అన్యాయం జరుగుతున్నా లోక్ సభలో ఎంపీలు మాత్రం నోరు మొదపలేదు. కేంద్రంలో భాగస్వామ్యమైన టీడీపీ ఎంపీలు ఉన్నా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు తెచ్చుకోలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: