తెదేపా ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయిన ప్రజలే ప్రతిపక్షం అవుతారని వైకాపా అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేవుగుడిలో ఏర్పాటు చేసి ఎంపిటిసి, మున్సిపల్ వార్డు సభ్యులను వుంచిన శిబిరంనకు మంగళవారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అధినేత జగన్‌కు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సభ్యులను పేరుపేరున పరిచయం చేశారు. అనంతరం ఎంపిటిసిలు, వార్డు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వైకాపాకు ఆధిక్యం వున్నా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చాలా దారుణంగా వుందన్నారు. యర్రగుంట్ల మున్సిపాలిటీలో 20వార్డుల్లో 18వైకాపా, 2తెదేపా వున్నా వైకాపా వారిని 8మందిని ప్రలోభపెట్టి, భయపెట్టి సమానంగా బలం చేసుకున్నా తెదేపా వారిపై దేవుడే మొట్టికాయ వేసి వైకాపాకే పట్టం కట్టారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే బాబు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు. వైకాపా కంటే కేవలం 21మంది ఎమ్మెల్యేల ఆధిక్యతతోనే తెదేపా అధికారంలో వుందన్న విషయం మరువకూడదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ, ఇంటికోజాబ్, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చలేనని చంద్రబాబుకు తెలుసన్నారు. అందుకే ప్రతిపక్షం గొంతునొక్కడానికే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా తెదేపా కుటిలయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబునాయుడుకు మళ్లీ ఎన్నికలకు వచ్చే ధైర్యం వుందా అన్ని ప్రశ్నించారు. హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయిన ప్రజలే ప్రతిపక్షంగా మారతారన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసేలా ప్రవర్తించిన వారు చరిత్రలో హిట్లర్‌నుండి నెపోలియన్ వరకు విలన్‌లుగా మిగిలిపోయారన్నారు. మనందరం కలిసి వుండడం వల్లనే ఎంతమంది అధికారులు కలిసి కూడా ఏమీచేయలేకపోయారన్నారు.  మున్సిపల్ ఎన్నికలు రెండు వాయిదావేయగలిగారు కానీ మూడోసారి దేవుడు మన పక్షాన వున్నాడన్నారు. అధికార పార్టీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరడడానికి సిద్దంగా వున్నామన్నారు. ఆగడాలపై అసెంబ్లీలో అధికార పక్షం తీరును ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్‌భాషా, కడప ఎంపి అవినాష్‌రెడ్డి, వైకాపా నాయకులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వివేకానందరెడ్డి, జిల్లా చైర్‌పర్సన్ రవి, పలువురు నాయకులు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు మండలాల ఎంపిటిసిలు, జమ్మలమడుగు మున్సిపాలిటి వార్డు సభ్యులు వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: