చంద్రబాబు సర్కారును ముప్పతిప్పలు పెట్టిన రుణ మాఫీ అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. హామీ అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కారు రీషెడ్యూల్‌తో రుణగ్రస్తులకు లబ్ధి చేకూర్చనుంది. అప్పును ప్రభుత్వానికి బదలాయించి... వడ్డీ, రీషెడ్యూల్ చేయని మండలాలకు దాదాపు ఆరువేల కోట్లు చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రుణమాఫీ అసాధ్యంటున్న విపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూ... హామీ అమలు దిశగా చంద్రబాబు సర్కారు ముందడుగు వేసింది. రుణాల రీషెడ్యూల్‌కు రిజర్వు బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఫలితంగా మాఫీకి మార్గం సుగమమైంది. ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా సర్కారు నిబంధనలు సిద్ధం చేస్తోంది. బినామీ ఖాతాలు, ఒకటికి మించిన ఖాతాల నుంచి రుణం తీసుకున్నా ఒక ఖాతాకే మాఫీని పరిమితం చేయనుంది. ఆర్‌.బి.ఐ. ఎన్నేళ్లపాటు రుణాల రీషెడ్యూలు చేస్తుందన్న దాని బట్టి చెల్లింపు వాయిదాలపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. రుణాలపై తక్షణం చెల్లించాల్సిన వడ్డీతోపాటు 96మండలాల్లో రుణాలు ప్రభుత్వమే తీర్చాల్సి వస్తే... అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు కోటయ్య కమిటీ ప్రాథమికంగా పలు సూచనలు ప్రతిపాదించనుంది. ఎర్రచందనం అమ్మకం, భూములు తనఖా ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: