గందరగోళం.. అదే నిరసన క్రమం.. 15వ లోక్‌సభలో ఏ దృశ్యాలను చూశామో... 16వ లోక్‌సభలోనూ పునరావృతమవుతున్నాయి. ఓవైపు రైల్వే బడ్జెట్..మరోవైపు పోలవరం బిల్లు.. ఇంకోవైపు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వ్యవహారం..సభ ప్రశాంతంగా సాగనే లేదు. తెలంగాణ, ఒడిశా సభ్యుల నిరసనల మధ్యనే హోంమంత్రి పోలవరం బిల్లును ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ సందర్భంగా బీజేపీ, తృణమూల్ సభ్యుల మధ్య సభాపర్వమే సాగింది. కాంగ్రెస్‌కు తన ప్రతిపక్ష హోదాపైనే ఆరాటమైపోయింది. తమ ఎంపీలతో,రాష్ట్రపతితో సోనియా మంతనాలు జరిపారు. మొత్తం మీద వివాదాలు.. నినాదాల మధ్యనే రైల్వే మంత్రి సదానంద గౌడ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీ, కోల్‌కతా: రైల్వే బడ్జెట్ సందర్భంగా మంగళవారం లోక్‌సభలో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం సేవించిన ఓ బీజేపీ ఎంపీ మరికొందరు ఎంపీలతో కలసి వచ్చి తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ ఆరోపించారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, భోజన విరామానంతరం సభ 2.10 గంటలకు ప్రారంభం కాగానే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పెంచిన రైల్వే చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపారంటూ నిరసన తెలిపారు. దీంతో సభను 3.30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైన తర్వాత తృణమూల్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. వీరికి ఆప్ ఎంపీలు కూడా జతకలిశారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి సదానందగౌడకు వ్యతిరేకంగా తృణమూల్ ఎంపీలు నినాదాలు చేశారు. దాంతో బీజేపీ ఎంపీలు కూడా కొందరు తమ సీట్ల నుంచి లేచి ఇప్పుడున్నది మోడీ ప్రభుత్వమంటూ నినదించారు. ఇద్దరు బీజేపీ ఎంపీలు(వారిలో ఒకరు హరినారాయణ్ రాజ్‌భర్) వెల్‌లోకి వచ్చి సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ తృణమూల్ ఎంపీలను నిందించారు. దీంతో వారి మధ్య వివాదం తలెత్తి ముష్టి యుద్ధానికి దిగారు. మార్షల్స్ వారిని వేరు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న హుకుందేవ్ నారాయణ్ యాదవ్ సభను 4.30కి వాయిదా వేసి వెళ్లిపోయారు. అనంతరం తృణమూల్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు. మమల్ని బెదిరించారు.. ‘‘మేం శాంతియుతంగా లోక్‌సభలో నిరసన తెలుపుతున్నాం. మద్యం సేవించి ఉన్న ఒక బీజేపీ ఎంపీ, ఇతర ఎంపీలతో కలసి వచ్చి మమ్మల్ని దూషించడంతోపాటు బెదిరించారు. మా పార్టీ ఎంపీ కల్యాణ్‌బెనర్జీ సభ నుంచి బయటకు వెళుతుంటే ఓ బీజేపీ ఎంపీ బెదిరించారు’’ అని కకోలి ఘోష్ వెల్లడించారు. మా పట్ల నీచంగా మాట్లాడారు: మమతాబెనర్జీ : లోక్‌సభలో మంగళవారం తన పట్ల, తమ పార్టీ ఎంపీల పట్ల బీజేపీ ఎంపీలు నీచంగా మాట్లాడారని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె హూగ్లీజిల్లా చందితలలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో బెంగాల్‌కు జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుతుంటే, తమ పార్టీ మహిళా ఎంపీ అయిన కకోలీ ఘోష్ చీరను లాగారని తెలిపారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. అయితే, తృణమూల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: