రాజ్యాంగం ప్రకారం లోక్ సభ మొత్తం బలం లో పదోవంతు సీట్లు వచ్చిన పార్టీనే ప్రతిపక్షం అవుతుంది. మరి 125 సంవత్సరాల పై చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది తెలియని అంశంకాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా స్వీప్ చేసిన సమయాల్లో కూడా ఏ పార్టీకీ ప్రధానప్రతిపక్షం హోదా దక్కలేదు. ఇప్పుడు బీజేపీ స్వీప్ చేసింది. ఎవరికీ ప్రధాన ప్రతిపక్షహోదా దక్కని స్థాయి విజయాన్ని సొంతం చేసుకొంది. మరి ఇప్పుడు హుందగా నడుచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు మాత్రం హాస్యాస్పదంగా మారింది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాల్సిందేనంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లోక్ సభ నియమావళి ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకపోయినా.. కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అత్యధిక సీట్లు దక్కించుకొన్న పార్టీల్లో రెండోది అయిన తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రపతిని కూడా కలిసి తమ కోరికను విన్నవించుకొంది. ఆయన మాత్రం ఏం చేస్తాడు.. ఎంత సోనియాగాంధీ చేత నియమితమైన వ్యక్తి అయినా.. ప్రణబ్ ముఖర్జీ కూడా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. 44 సీట్లను మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేకపోవచ్చు. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ దీన స్థితిని ఎంజాయ్ చేస్తూ.. ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, ఇక మేంఏం చేయగలం అంటూ రాగాలు తీస్తోంది! మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గాఉండాల్సింది పోయి అనవసరంగా అభాసుపాలవుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినంత మాత్రాన పోయేదేమీ లేకపోయినా... అనవసరంగా దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ... నవ్వుల పాలవుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: