కలల బడ్జెట్ వస్తోంది.. ఇక కష్టాలన్నీ తీరిపోతాయి.. మోడీ సర్కార్ తొలి సాధారణ బడ్జెట్ పై సామాన్యుడి నుంచి బడా బిజినెస్ మెన్ వరకు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు..! అయితే కేంద్రం వైఖరీ చూస్తే మాత్రం.. ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంటున్నట్లుగా ఉంటోందనే వార్తలు వినిపిస్తున్నాయ్.. ఆదాయపన్ను పరిమితి పెంచుతారని ఇలా ఓ అంచనా ఏర్పడిందో లేదో.. ఇంతలోనే సంక్షేమ పథకాలపై అరుణ్ జైట్లీ సంచలన ప్రకటన చేశారు. పనికిరాని ప్రజాకర్షక పథకాలకు మంగళం పాడాలన్నారు. దీన్ని చూస్తే... జైట్లీ వండుతున్న బడ్జెట్ హల్వాలో... తీపిపాలు తక్కువగానే ఉంటేట్లుంది. హల్వా తయారీలో ఓ చెయ్యేసి మరీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో పంచదార పాళ్లు ఎక్కువగా ఉండేట్లు కనపించడం లేదు. ముందున్నది మొసళ్ల పండగేనని పరోక్షంగా చెప్పేస్తున్నారు అరుణ్ జైట్లీ. వాతలు తప్పకపోవచ్చని ముందునుంచి ఉన్న అంచనాల అనుగుణంగానే.. ఆయన మాటలు ఉంటున్నాయి. మన దేశానికి పనికిమాలిన ప్రజాకర్షక పథకాలు అక్కర్లేదంటూ.. సంచలనం సృష్టించారు జైట్లీ. వీటిపై చేసే అర్థం పర్థం లేని వ్యయం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందన్నారు. భారతదేశానికి ఆర్థిక క్రమశిక్షణ కావాలని, సంక్షేమ పథకాలను అటకెక్కించాల్సిన అవసరముందంటూ... తన మనో చిత్రాన్ని ఆవిష్కరించారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గారు..! భారత జీడీపీ వృద్ధిరేటు ఇప్పటికే మందగమనంలో ఉందని, ద్రవ్యలోటు కూడా చాలా ఎక్కువగా ఉందని వివరించారు. గత రెండేళ్లతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగానే ఉన్నా... ఇప్పటికీ అది ఆమోదయోగ్యమైన స్థాయి కంటే ఎక్కువగానే ఉందని వెల్లడించారు. దేశం ముందు అనేక సవాళ్లున్నాయన్న జైట్లీ, రుతుపవనాలు ఆశాజనకంగా లేవని, ఇరాక్ సంక్షోభం.. ప్రభావంతో చమురు ధరలు మండిపోతున్నాయని తెలిపారు. వాతలు తప్పకపోవచ్చు.. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో ప్రజాకర్షక పథకాలపై అధికంగా ఖర్చు చేయడం సరైన చర్య కాదని... జైట్లీ అభిప్రాయం. వీటిపై ఎక్కువగా దృష్టి పెడితే ఖజానాపై భారం పెరిగిపోతుందని, దీన్ని తట్టుకునేందుకు పన్నులు వేయాల్సొస్తుందని ఆయన గతంలోనే చెప్పారు. జైట్లీ ఈ కామెంట్స్ చూస్తుంటే... కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఓ అంచనాకు వచ్చేయచ్చని అర్థమవుతుంది. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన ఎన్డీయే... ప్రభుత్వం వచ్చీ రాగానే పలు వస్తువులు, సేవలు, నిత్యావసరాల ధరలను పెరిగేలా నిర్ణయాలు తీసుకుంది. అయితే ముందు నుంచి కూడా ఆర్ధికవేత్తలు ఈసారి కేంద్రబడ్జెట్ లో వాతలు తప్పకపోవచ్చునని అంచనాలు వేస్తూనే ఉన్నారు. మతిలేని ప్రజాకర్షక పథకాలకు తన బడ్జెట్ లో చోటులేదని అరుణ్ జైట్లీ పరోక్షంగా చెప్పేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జూలై పదిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో... ప్రజాకర్షణ పథకాలకంటే ముందు జాగ్రత్త చర్యలకే ప్రాధాన్యత ఇస్తానని ఆయన సంకేతాలిచ్చారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేంద్రం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోనుందని, ద్రవ్య స్థిరీకరణకే తొలి ప్రాధాన్యమన్నారు. దేశంలో సరిపడా ఆహార ధాన్యాల నిల్వలున్నాయని, వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉందని జైట్లీ తెలిపారు. దీనితో రానున్నది సంస్కరణల బడ్జెట్ అని తెలిసిపోతోంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ సంశయం మొదలైంది. తమిళనాడు మినహా... దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజాకర్షక పథకాల అమలవుతున్నాయి. వీటి అండతోనే... తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్్లో టీడీపీ గద్దెనెక్కాయి. ఈ పార్టీల హామీలు నెరవేర్చాలంటే... కేంద్రం ఉదారంగా సాయం చేయాలి. ఇప్పుడు మోడీ సర్కారు వాలకం చూస్తుంటే... ప్రజాకర్షక పథకాలకు చరమగీతం పాడేటట్టుగానే కనిపిస్తోంది. భారీ అంచనాలు, భారీ ఆశలు ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లు ఏ విధంగా నడుచుకోనున్నదో ఈ బడ్జెట్ తెలియచేస్తుందని భావిస్తున్నారు. పూర్తిస్థాయి అధికారంలోకి రావడంతో రైల్వే చార్జీలను పెంచడం ద్వారా సంస్కరణల పరంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ బడ్జెట్‌లో కూడా సంస్కరణల పరంగా పలు నిర్ణయాలుంటాయనేది మార్కెట్ వర్గాల అంచనా. ఈసారి బడ్జెట్ లో తమకు పరిశ్రమ మోదా ఇవ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కోరుకుంటోంది. చౌక గృహ విభాగాన్ని ప్రాధన్యత రంగంగా గుర్తించాలని రియల్ వ్యాపారులు కోరుతున్నారు. గృహ రుణాల వడ్డీని 7శాతం కిందకు తీసుకువచ్చి పరిశ్రమలో గిరాకీ పెంచాలని అంటున్నారు. అటు దేశంలోని దాదాపు రెండు లక్షల యాభై వేల గ్రామాలను అనుసంధానం చేసే జాతీయ అఫ్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను ప్రకటించాలని టెలికాం రంగం కోరుతోంది. అదే సమయంలో బడ్జెట్ లో స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ తదితరాల్లో బడ్జెట్ లో స్పష్టత కావాలని కోరుకుంటోంది. అటు టవర్ కపెంనీలకు కూడా మౌలిక హోదా తోపాటు పన్నులు, సుంకాల సువ్యవస్థీకరణ జరగాలి టెలికాం రంగం కోరుకుంటోంది. బడ్జెట్ లో జీఎస్ టీ అమలుపై సరైన ప్రఠాళికతో వెలితే మంచిదని FMCG రంగం ఆశిస్తోంది. అదే సమయంలో బంగారం దిగుమతి నిబంధనల సడలింపు, వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబుల పెంపు తదితరాలను పరిశీలించాలంటోంది. ఏం కోరుకుంటున్నారంటే... ముడి పామాయిల్ పై దిగుమతి సుంకుం పెంపుతోపాటు మన్నికైన వినిమయే తర వస్తువులపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు, జీఎస్ టీ అమలును ముందుకు జరపాలని కోరుకుంటున్నారు. రైతుల ఆదాయాలు పెరిగే దిశగా ప్రభుత్వం పనిచేయాలి..దిగుమతులను మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నూనె గింజల అభివృద్ధి పథకాలను ఆర్థిక మంత్రి ప్రకటించాల్సి ఉంది. శుద్ధి చేసిన పామాయిల్ పై కనీసం 10 శాతం దిగుమతి సుంకం ఆశిస్తున్నారు. దేశీయ సబ్బులు ఉత్పత్తిని పోత్సహించేందుకు పారిశ్రామిక కెమికల్స్, నూనెలు, ఇతర కొవ్వు ఆమ్లాలపై కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం సమీక్షించాలంటున్నారు. పార్మా ఎస్ఈజడ్ యూనిట్లను మ్యాట్ నుంచి మినహాయించాలి. ఈ ఎస్ఈజడ్ లకున్న అయిదేళ్ల పన్ను విరామాన్ని..అదనంగా రెండేళ్లు పాటు పొడగించాలని ఫార్మా రంగం కోరుతోంది. కాంట్రాక్ట్ తయారీ పరిశ్రమకు వడ్డీ, సబ్సిడీలు, దీర్గకాల రుణాలివ్వాలని... పరిశోధన-అభివృద్ధి వ్యాయాలకు ఇస్తున్న వెయిటెడ్ డిడక్షన్ ప్రయోజనాలకు అంతర్జాతీయ పేటెండ్లు, క్లినికల్ పరిశోధనలు, ఇతర పొరుగు సేవలకు విస్తరించాలంటున్నారు. దేశీయంగా అభివృద్ది పరిచిన బయోటెక్ మందులను పన్నులు, ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయించాలి. మధుమేహం, కేన్సర్, కార్డియోవాస్కులర్ వంటి దీర్ఘకాల రుగ్మతల చికిత్సకు ఉపయోగించే అన్ని నిత్యావసర మందులనూ పన్ను బారి నుంచి తప్పించాలిని కోరుతున్నారు. పరిశోధన-అభివృద్ధి పై ఉన్న 200 శాతం వెయిటెడ్ డిడక్షన్ ను 250 పెంచాల్సి ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగస్తులు కూడా చాలా వరకు ఆశలు పెట్టుకున్నారు. పన్ను పరిమితుల పెంపు, వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని గణనీయంగా పెంచడం వంటి అంశాలతో తమకు ఊరట కలిగిస్తారని ఉద్యోగులు భావిస్తున్నారు. ద్రవ్యోల్పణం దెబ్బకు బెంబేలెత్తిన వర్గాల్లో ఉద్యోగస్తులు కూడా వున్నారు. అదే సమయంలో పెట్టుబడులను విస్తృతంగా పెంచే క్రమంలో జైట్లే కొన్ని ప్రకటనలు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పారిశ్రామిక రంగానికి ఆయన భారీగా పన్ను రాయితీలు వంటి ప్రోత్సాహకాలివ్వవచ్చని ఆశిస్తున్నారు. బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్‌, వస్తువినిమయ రంగాలకు ఎక్సైజ్‌ సుంకాల రాయితీలను డిసెంబరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఇలాంటి రాయితీలు మరికొన్ని బడ్జెట్‌లో ప్రధానంగా చోటుచేసుకుంటాయంటున్నారు. మరోవైపు, అరుణ్‌జైట్లీ రైతాంగానికి ఊరట కల్పించే కొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటు న్నట్లు సమాచారం. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో దేశంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ ఫలసాయం తగ్గే అవకాశాలు అధికంగా వున్న విషయం తెల్సిందే. అందుకే బిజెపి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. అలాగని ప్రజాకర్షక పథకాల పేరుచెప్పి ద్రవ్యపతనాన్ని మరింత దిగజార్చే చర్యలు ఉండబోవని, ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు అవసరమైన కొన్ని కఠిన చర్యలు కూడా వుంటాయని చెబుతున్నారు. అటు ప్రజలపై భారాలు మోపకుండా జాగ్రత్తలు తీసుకుంటామే తప్ప, ఆర్థిక పరిపుష్టికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ''అనాలో చిత ప్రజాకర్షక పథకాల జోలికి వెళితే అది ఖజానాకే తీవ్ర నష్టదాయకం. అత్యధిక పన్నులు చెల్లించే సమాజాన్ని తయారు చేయగలగాలి. అంటే ప్రజల సంపద పెరగాలి. ఇందుకోసం ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అప్పుడే ఆర్థిక పరిపుష్టికి మార్గం సుగమం చేయగలం'' అని అరుణ్‌ జైట్లీ తన మనసులోని మాట చెప్పారు. కొన్ని కఠినచర్యలు తీసుకోకపోతే, చితికిన ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగుతుం దని కూడా జైట్లీ హెచ్చరించారు. ధూమపాన ప్రియులకు కంటతడి ధూమపాన ప్రియులకు ఈ బడ్జెట్‌ కంటతడి పెట్టించవచ్చు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం వుంది. అదేసమయంలో వార్షికంగా 10 కోట్ల రూపాయలపైబడి సంపాదిస్తున్న వారిపై ప్రభుత్వం పన్ను వాత వేయవచ్చంటున్నారు. భారత పరిశ్రమలకు చెందిన అధిపతులు ఇదివరకు తమ కోర్కెల జాబితాను జైట్లీకి సమర్పించారు. కార్మిక సంఘాలు, కొన్ని సామాజిక సంస్థలు కూడా వినతలు సమర్పించుకున్నాయి. వీటిని పక్కనపెట్టేది లేదని, అందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటా మని జైట్లీ చెపుతూవచ్చారు. విదేశీ పెట్టుబడుదారులకు మార్గం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైన పన్నులకు సంబంధించి కొన్ని సవరణలు తీసుకువస్తామని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనప్పటికీ, గురువారం నాటి జైట్లీ బడ్జెట్‌పై సాధారణ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్న మాట మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: