2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను మోడీ సర్కార్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పై మధ్యతరగతి, పారిశ్రామిక వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిని పట్టాలపైకి ఎక్కించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఈ బడ్జెట్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచే అవకాశం ఉంది. పన్ను శ్లాబులు, పన్ను మినహాయింపు వర్తించే ఆదాయ పరిమితులను మార్చకపోవచ్చు. బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుండటం వల్ల... రైతులకు ఉపశమనం లభించే విధంగా బడ్జెట్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అడ్డూ అదుపూ లేకుండా ఉన్న ధరలను స్థిరీకరించేందుకు నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ధరల పెంపు వల్ల ఆగ్రహంగా ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా బడ్జెట్ లో తాయిళాలు ప్రకటించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధమవుతున్నారు. అందరికీ కీలకమైన వ్యక్తిగత ఆదాయ పన్నుకు ఐటీ మినహాయింపు పరిమితిని ఇప్పటికంటే మరింత పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 లక్షల వరకూ ఆదాయంపై ఐటీ మినహాయింపు ఉండగా.. దీన్ని 3 నుంచి 5 లక్షల వరకూ పెంచే అవకాశాన్ని ఆర్థికశాఖ పరిశీలిస్తోంది. ఇక కొన్ని రకాల పెట్టుబడులపై ఇస్తున్న మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ పథకాలు, బీమా పత్రాలు, మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో లక్ష వరకూ పెట్టే పెట్టుబడులు, పొదుపులకు ప్రస్తుతం పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తోంది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మినహాయింపు పరిమితి కూడా 2 లక్షలకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతా అనుకున్నట్టు వ్యక్తిగత ఆదాయ పరిమితిని 2 నుంచి 3 లేదా 5లక్షలకు పెంచితే మోడీ సర్కార్ పై ప్రజల్లో కొంత సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల దేశంలో లక్షలాది కుటుంబాలకు పన్ను రాయితీ లభిస్తుంది. మరి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏం చేస్తారో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: