హైదరాబాద్.. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలోని 23 జిల్లాల వారికి ఇదే హాట్ ఫేవరేట్.. రాష్ట్రంలో ఏమూల ఉన్నవారైనా.. హైదరాబాద్ లో ఇంటి స్థలం సంపాదించుకోవాలని.. ఇక్కడే స్థిరపడాలని ఆశపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ తన ఆకర్షణ క్రమంగా కోల్పోతుందా.. కొన్ని అధ్యయనాలు అదే నిజమంటున్నాయి. ఇప్పటికే 7,8 సంవత్సరాలుగా హైదరాబాద్ , దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ గమనం మందకొడిగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో.. అంతకు ముందున్న ఆకర్షణ తగ్గింది. ఇప్పుడు కేసీఆర్ సర్కారు దూకుడు చర్యల కారణంగా సీమాంధ్రులు.. హైదరబాద్ పేరు చెబితేనే ఎందుకొచ్చిన గొడవ అనుకునే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 2007-2013 మధ్య కాలంలో 24 నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు పెరిగాయి.. రెండు నగరాల్లో మాత్రం తగ్గాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొచ్చిలో 15 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నివాస స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గాయని ఆర్థిక సర్వే పేర్కొంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే జోరును బట్టి పెరుగుదల శాతంలో తేడాలుంటాయి. మరీ అంతగా డిమాండ్ లేకపోతే.. నిలకడగా ఉంటాయి. అంతే కానీ.. తగ్గవు. అలా తగ్గాయంటే అది ప్రమాదకర సూచికే అనుకోవాలి. హైదరాబాద్ లో 7 శాతం ధరలు తగ్గిన సమయంలోనే.. చెన్నైలో అత్యధికంగా 230 శాతం, పూణేలో 123, ముంబైలో 122 శాతం ధరలు పెరిగాయని ఆర్థిక సర్వే చెబుతోంది. ఈ లెక్కలు అన్నీ.. 2013 వరకూ మాత్రమే.. 2014లో కేసీఆర్ గద్దెనెక్కాక.. హైదరాబాద్ పరిస్థితులు మరింతగా మారాయి. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాల కూల్చివేత, ఫీజు రీఎంబర్స్ మెంట్ లో వివక్ష, స్థానికత వంటి అంశాలు వివాదాస్పదమయ్యాయి. మరోవైపు.. అటు రాజధాని వార్తల నేపథ్యంలో.. విజయవాడ-గుంటూరు- మంగళగిరి- అమరావతి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగిపోయింది. ఎంతదాకా వెళ్లిందంటే.. ప్రభుత్వం చివరకు రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా.. ఇతర నగరాల్లో ఆంధ్రలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆశాజనకంగానే ఉంది. అలాగని... హైదరాబాద్ కు ఫ్యూచర్ లేదన్న అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుంది. ఐటీఐఆర్ వంటి లక్షల మంది ఉద్యోగులను తయారు చేసే కొత్త ప్రాజెక్టులతో పాటు.. కొత్త అవకాశాలూ వెలుగు చూస్తాయి. హైదరాబాద్ కు ఉన్న అద్భుత వాతావరణానికితోడు.. ఇప్పటికే సమకూరిన మౌలిక సదుపాయాల కారణంగా కొత్త పెట్టుబడులకు.. గిరాకీకి ఢోకా ఉండదు. కాకపోతే... ఇక్కడి మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఇక్కడి మార్కెట్ మూవ్ అయ్యే అవకాశాలున్నాయి. కొంతకాలం ఆగుదామని మార్కెట్ కు దూరంగా ఉన్నవాళ్లంతా కొన్నాళ్లకు మళ్లీ మార్కెట్ బాట పడితే.. మళ్లీ భూమ్ జోరందుకోవడం ఖాయం. అందుకే భూమి కొనేవాళ్లు.. ఏదైనా స్వల్పకాలిక దృష్టితో కాకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను బేరీజు వేసుకుని ముందుడుగు వేయడం మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: