హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచే అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు పెట్టారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆకర్షణీయ ప్రాంతం కావాలంటే.. అన్నింటికన్నా ముందు ఉండాల్సింది భద్రత. కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉద్యమాల ఫలితంగా తరచూ ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. మిలియన్ మార్చ్ , అసెంబ్లీ ముట్టడి, ఓయూలో ఫైరింగ్ వంటి ఘటనలు జరిగాయి. బంద్ ల సమయంలో చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ భవనాలకు సేఫ్టీ కవర్లు వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. హైదరాబాద్ బ్రాండ్ ను మరింతగా మెరుగుపరచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. భద్రత అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్.. ఈ అంశంపై చర్చించేందుకు.. పోలీస్ ఉన్నతాధికారులు, జీఎంఆర్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పా టు చేయాలని సూచించారు. సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమమైన భద్రత, రక్షిత నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని కేసీఆర్ వారికి వివరించారు. ప్రపంచంలోని వివిధ నగరాల్లో అమల్లో ఉన్న భద్రత వ్యవస్థలపై భేటీలో లోతుగా చర్చించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌ పై కసరత్తు చేస్తున్న జీఎంఆర్ ప్రతినిధులు.. తమ ప్లాన్ ను సీఎం కేసీఆర్ కు వివరించారు. లండన్ తరహా భద్రత వ్యవస్థపై పవర్ పాయింట్ ద్వారా వివరణ ఇచ్చారు. నేరం జరిగిన వెంటనే క్షణాల్లో సమాచారం తెలుసుకోవడం, సత్వరమే ఘటనాస్థలానికి చేరుకొని స్పందించే వ్యవస్థను అభివద్ధి చేయడం గురించి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ లో భద్రత, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని జీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన నడుపుతున్న జీఎంఆర్.. దాన్ని మరింత అభివద్ధి చేసే ప్రతిపాదనలను కూడా సీఎంకు వివరించారు. భద్రత పెంపొందించడం కోసం హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు, సెన్సర్లు, అలారం సిస్టమ్, డాటా స్టోరేజీ అండ్ వీడియో అనాలటిక్స్ సిస్టమ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థల ఏర్పాటుపై కేసీఆర్ అధికారులతో చర్చించారు. ప్రపంచంలో ది బెస్ట్ సిటీల్లో అమల్లో ఉన్న వ్యవస్థను అధ్యయనం చేసి హైదరాబాద్‌కు అవరసమైన భద్రత ఏర్పాట్లను రూపొందించాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ మొత్తం ప్రతీ క్షణం వీక్షించేలా నిఘా వ్యవస్థను పటిష్ఠపరుచాలన్నారు. సీసీ కెమెరాల అండతో నిఘాను మరింతగా ఆధునీకరించాలని సూచించారు. రక్షణ కోసం వివిధ ప్రైవేట్, ప్రభుత్వ, కాలనీవాసులు ఏర్పాటు చేసుకుంటున్న సీసీ కెమెరాలను పోలీస్ భద్రత వ్యవస్థతో అనుసంధానం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. అంతా బాగానే ఉన్నా... కేసీఆర్ సర్కార్ కూడా రాజధానిలో ఉంటున్న అన్ని ప్రాంతాల ప్రజలను సమదృష్టితో చూస్తే.. ఓ వర్గం ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. ఆ విషయంలో ఆయన కాస్త పురాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: