కేసీఆర్ పాలనలో ఈమధ్య బాగా వివాదాస్పదం అయిన అంశాల్లో మెట్రో ప్రాజెక్టు ఒకటి. పురాతన, వారసత్వ కట్టడాలను పరిరక్షించి తీరాల్సిందేనంటూ కేసీఆర్ పట్టుబట్టడం వల్ల సర్కారుకు-మెట్రో నిర్మిస్తున్న ఎల్ అండ్ టీకు మధ్య విబేధాలు తలెత్తాయి. భాగ్యనగరానికే తలమానికం అనిపించదగిన ప్రాజెక్టు.. భవితవ్యంపై నీలినీడలు అలముకున్నాయి. ఆ తర్వాత సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. కట్టడాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కట్టడాలున్న ప్రాంతంలో కేసీఆర్ సొరంగం మార్గం నిర్మాంచాలని సూచించినా..ఇప్పటికిప్పుడు ప్లాన్ మార్చడం కష్టమని మెట్రో తేల్చిచెప్పింది. నేపథ్యంలో తాజాగా.. కేంద్రం సీన్ లోకి ఎంటరైంది. ముందుగా ఆమోదించిన నమూనా ప్రకారమే.. అనుకున్న సమయానికే మెట్రో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతే కాదు వివిధ మంత్రిత్వ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించింది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో ఇలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేయడం మామూలే. కానీ కేసీఆర్-ఎల్ అండ్ టీ వివాదం నేపథ్యంలో కేంద్రం జోక్యం వెనుక రాజకీయ ఒత్తిళ్లేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కోరుతున్నట్టుగా నమూనా మార్పలొద్దని లేఖలో స్పష్టంగా పేర్కొనడం తెలంగాణ సర్కారును ఇరుకునపెట్టే విషయమే. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు దేశ మౌలిక రంగాన్ని ప్రభావితం చేస్తుందని.. కేంద్రం అభిప్రాయపడుతోంది. తెలంగాణ సర్కారుకు రాసిన లేఖలోనూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం అదే విషయం ప్రస్తావించారు. త్వరితంగా పనులు చేపట్టి.. ప్రాజెక్టు వ్యయం, అంచనాలు పెరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించామని... సంబంధిత విభాగాలను టార్గెట్స్ ఫిక్స్ చేశామని ఆయన లేఖలో వివరించారు. మెట్రో ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అనుమతులు, సమన్వయం కావలసివచ్చినా తమను సంప్రదించవచ్చంటూ కేంద్రం లేఖలో పేర్కొంది. మెట్రో ప్రాజెక్టు విషయంలో కేంద్రం చూపిన చొరవ, అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పడం అభిలషణీయమే అయినా.. ఈ లేఖను టీఆర్ ఎస్ వర్గాలు ప్రత్యేక కోణంలో చూస్తున్నాయి. ఈ లేఖ ద్వారా కేంద్రం ఏం చెప్పదలచుకుందన్న విషయంపై రకరకాలుగా విశ్లేషించుకుంటున్నాయి. మెట్రో త్వరగా పూర్తి చేయాలని.. డిజైన్ మార్చవద్దని చెప్పడం.. సూచనగా భావించాలా.. హెచ్చరికగా అర్థం చేసుకోవాలో అర్ధంకాక జుట్టుపీక్కుంటున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: