కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్‌ అని, ఈ బడ్జెట్‌ బరి తెగించిన ధనికవర్గ అనుకూల మైనదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే సామాన్యులకు మంచి రోజులు వస్తాయని బిజెపి ప్రచారం చేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ను పరిశీలిస్తే ''సామాన్యులకు చీకటి రోజులు, కార్పొరేట్‌ రంగానికి మంచి రోజులు'' రానున్నట్లు తెలుస్తున్నదని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సుధాకరరెడ్డి పై విధంగా వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కార్యవర్గసభ్యులు అజీజ్‌ పాషా, డాక్టర్‌ కె.నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు కూడా పాల్గొన్నారు. ప్రపంచబ్యాంకు, అమెరికా విదేశీ గుత్తపెట్టుబడిదారీ సంస్థలను సంతృప్తిపర్చడానికే ఈ బడ్జెట్‌ ఉపయోగపడుతుందని, గతంలో యుపిఎ 2 అనుసరించిన విధానాలను బిజెపి ప్రభుత్వం మరింత వేగంగా అమలు పర్చగలదనడానికి ఈ బడ్జెట్‌ సూచిస్తున్నదని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, జాతీయ బ్యాంకుల నుంచి ప్రభుత్వ వాటాలను ఉపసంహరించడం, బీమా, రక్షణ రంగాలలో ఎఫ్‌డిఐలను ప్రవేశపెట్టి, విమానాశ్రయాలు, పోర్టుల నిర్మాణంలో ప్రభుత్వ ప్రైవేటురంగ భాగస్వామ్యం (పిపిపి) పేరుతో ప్రైవేటు శక్తులను భాగస్వాములను చేయడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఏ అంశాలను వ్యతిరేకించిందో అవే అంశాలను ఈ రోజు అమలు పర్చడం విచిత్రంగా వుందన్నారు. విద్యా, ఆరోగ్యం, ఇతర సంక్షేమ పథకాలకు చాలీచాలని నిధులను కేటాయించి చిన్నచూపు చూసిందని, నాబార్డు ద్వారా రైతులకు ఇచ్చే 3 శాతం రుణాలు ఒక్క రాష్ట్రానికి కూడా సరిపోవని, అలాంటిది అవి దేశవ్యాప్తంగా ఎలా సరిపోతాయని సుధాకరరెడ్డి ప్రశ్నించారు.  బడ్జెట్‌లో ధరల నియంత్రణపై ఎలాంటి ప్రస్తావన లేదని, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పడం ఆర్థిక మంత్రి నిస్సహాయతను సూచిస్తుందని, సెజ్‌లను పునరుద్ధరిస్తామని చెప్పడమంటే ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని, బిజెపి విజయానికి పెట్టుబడులు పెట్టిన వారిని ఆదుకోవటానికి ఈ బడ్జెట్‌ రూపొందించారని విమర్శించారు. అసలు కఠిన నిర్ణయాలు పేద ప్రజలకు వ్యతిరేకంగానే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి లక్షల కోట్లు ఆస్తులు సంపాదించిన వారిపట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ బడ్జెట్‌ ద్వారా సామాన్య ప్రజలకు ఒరిగేదేమీలేదని అన్నారు. ఎస్సీల ఉపప్రణాళిక నిధులు, మైనారిటీల సంక్షేమం కోసం కేటాయింపులు సరిపోవని అన్నారు. సిపిఐ, ఇతర వామపక్షాలకు శాసనసభ, పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గినప్పటికీ కేంద్ర బడ్జెట్‌పై బయట సిపిఐ మిగిలిన వామపక్ష పార్టీలతో చర్చించి, ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపోరాటాలను చేపడతామని సుధాకరరెడ్డి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: