ఎన్నికలకు ముందే సమైక్య విధానం అనుసరించిన జగన్.. అప్పుడే తెలంగాణపై ఆశలు వదిలేసుకున్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీ మనుగడ కష్టమని భావించి.. ఏపీలోనైనా బలపడదామని ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా..జనం మాత్రం అధికారం కట్టబెట్టలేదు. పరాజయ భారాన్ని అతికష్టమ్మీద జీర్ణించుకున్నఈ యువనేత.. బలమైన ప్రతిపక్షనేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో.. ఊహించిన దానికన్నా.. బాగానే స్పందించి.. తానేం తక్కువ తినలేదని రుజువు చేసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లో తన స్థాయి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏపీ వరకూ జగన్ వ్యూహాలు, ప్రణాళికలు ఫరవాలేదు. కానీ ఆయన తెలంగాణను పూర్తిగా వదిలేసినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ గత సార్వ త్రిక ఎన్నికల్లో పరిమిత సీట్లు సాధించుకొని తన ఉనికిని చాటుకొన్న జగన్ పార్టీ.. ఇక్కడ పట్టుపెంచుకోవడంపై దృష్టిసారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు ఏర్పడినా తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర కమిటీ, పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కార్యచరణ వంటి వాటిపై జగన్ దృష్టి పెట్టడం లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన కీలకమైన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినా..... అన్ని జిల్లాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు క్యాడర్‌ ఇంకా మిగిలేఉంది. కనీసం గాన్ని కాపాడుకొనే ప్రయత్నం జగన్ చేయడంలేదని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి.... తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులు వలస వచ్చిన ప్రాంతాల్లో జగన్ పార్టీకి మంచి పట్టుంది. మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరపున ఎంపికయ్యారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్న సీపీఐ ఈ జిల్లాలో కనుమరుగైతే... సమైక్యనినాదం ఎత్తుకొన్నప్పటికీ జగన్ పార్టీ ఈ మేరకు సీట్లు సాధించడం గొప్ప విషయమే. తెలంగాణలో ఉనికిని చాటుకొనేందుకు అన్ని పార్టీలు దూసుకెళ్తుంటే తమ పార్టీ నాయకత్వం తీరు అందుకు విరుద్దంగా ఉం దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలే నిట్టూరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ పార్టీ ఏకపక్షంగా సమైక్యనినాదం ఎత్తుకోవడంతో తెలంగాణలోని ఆ పార్టీ క్యాడర్‌ చాలా వరకు చెల్లాచెదురైంది. అయినా పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు మెజార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నా రు. ఈ నేపథ్యంలో నాయకత్వంలేని చోట్ల కనీసం పార్టీ నాయకత్వం కొత్త నియామకాలపై దృష్టిసారించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. కొత్త నాయకత్వంను తెరపైకి తీసుకొస్తే ఉత్సాహంగా వారు జనంలోకి వెళ్తారని తెలంగాణకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు చెబుతున్నారు. మరి ఇకనైనా జగన్ తెలంగాణపై దృష్టి పెడతారో లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: