భారత ప్రభుత్వంలో విలీనం కావడానికి వ్యతిరేకించి ఆనాడు ఢిల్లీతో యుద్ధం చేశారు నిజాం ప్రభువులు. సీమాంధ్ర నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలంటూ మొన్నటి వరకూ కేంద్రంతో పోరాడారు తెలంగాణవాదులు. ఇప్పుడు తాజాగా మరోసారి అదే ఢిల్లీతో తాజా యుద్ధం కోసం ప్రస్తుత నైజాం పాలకులు సైతం సిద్ధమయ్యారు. పదేళ్ల యూపీఏ పాలనలోనూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంతో ఢిల్లీకి తెలంగాణతో నిత్యం తన్నులాట తప్పలేదు. మొన్నటిదాకా రాష్ట్రం కోసం, రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడేమో.. ఆస్తి పంపకాల కోసం, హక్కుల సంరక్షణ కోసం హస్తినతో తెలంగాణకు కురుక్షేత్రం తప్పేలా లేదు. ఒక్కటా... రెండా... చెప్పుకుంటూ పోవడానికి... ఇరు తెలుగు రాష్ట్రాల మధ్యన తగవులు పెడుతున్న అంశాలు ఎన్నో... పోలవరం రూపం, ముంపు గ్రామాల విలీనం, క్రిష్ణా-గోదావరీ నీటి పంపకం, హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణ, విద్యుత్ పంపకాలు.... ఇలా చెప్తూ పోతే పంచాయితీ లేని అంశమంటూ లేదు. వీళ్లు మాదంటే... వాళ్లు మాకూ అంటారు. వాళ్లు వంద సాయం అడిగితే... వీళ్లు రెండింతలు కావాలంటారు. ఇక అసలు విషయానికి వస్తే... ఢిల్లీ పీఠంపై కూర్చున్న బీజేపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ భావనే ఇప్పుడు కేంద్రంతో టీ గవర్నమెంట్ యుద్ధానికి తెరతీసింది. ఆది నుంచీ క్రిష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా పనిచేస్తోందని కేసీఆర్ ప్రభుత్వం విమర్శిస్తోంది. తాగునీటి కోసం అంటూ నీటిని తరలించి నారుమళ్లు సాగుచేసుకుంటున్నారని ఆరోపించింది. ఈ వివాదాలపై తాజాగా ఇరు రాష్ట్రాల అధికారులతో క్రిష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు ఛైర్మన్ పాండ్య... ఇరు రాష్ట్రాలకూ చెరో 13 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆదేశించారు. దీనిపైన అసంతృప్తితో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇక ఢిల్లీలోనే అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయింది. ప్రతీ సందర్భంలోనూ తమకు క్రిష్ణా నీటి కేటాయింపులో అన్యాయమే జరుగుతోందని తేల్చి చెప్పడానికి కసరత్తులు చేస్తోంది. ఇదే అంశంపై కేంద్ర జల వనరుల మంత్రిని కలవడానికి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. హరీష్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఆ శాఖ రాష్ట్ర అధికారులు కేంద్ర జల జల వనరుల శాఖకు లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ తోపాటు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సైతం తెలంగాణ ప్రయోజనాలకు ఆటంకం కలిగించేలా ఉందని వివరించారు. సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ను నియమించాలనీ కోరారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేసిన కేసు వాదనలు ఈనెల 21 న జరగనున్నాయి. ఇదే కేసులో సొంతంగా పిటిషన్ వేసైనా సరే... మిగులు జలాల్లో 80 టీఎంసీల వాటా సాధించుకోవాలని టీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధపడింది. క్రిష్ణా నీటితో ప్రారంభమవుతున్న ఈ యుద్ధం మున్ముందు మరెన్ని సమస్యలపై నడుస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: