తమపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని అంటోంది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. తమ పార్టీ ఓడిపోయాకా... కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా... సోనియాగాంధీ తొలిసారి ఈ తరహా ప్రకటన చేసింది. తమపై మోడీసర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని సోనియాగాంధీ అంటున్నారు! మరి మొన్నటి వరకూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న సోనియాగాంధీ నోట ఇప్పుడు ఇలాంటి ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. మరి మోడీ సర్కార్ సోనియాను ఏ విధంగా వేదిస్తోంది? ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది? అనే విషయాల గురించి పరిశీలించినట్టు అయితే.. అవి బయటకు కనిపించేవీ కాదనిపిస్తోంది. అయితే నేషనల్ హెరాల్డ్ స్కామ్ కు సంబంధించి మాత్రం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ అయ్యాయి! యూపీఏ హయాంలో ఎన్నో స్కాములు జరిగినా... లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా.. వాటిల్లో ఎక్కడా సోనియా పేరు బయటకు రాలేదు. ఆ ప్రభుత్వానికి పెద్ద తలకాయగా ఉండినా.. ఆమెను ఏ దర్యాప్తు సంస్థ కూడా నిందితురాలిగా చేర్చలేదు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చాకా... సోనియాగాంధీ ప్రియమైన శత్రువు సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ తో ఆమె ఇబ్బందులు పడుతోంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో సోనియా, రాహుల్ లకు నోటీసులు జారీ అయ్యాయి. వారిద్దరూ అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది ఆరోపణ. బహుశా దీనిపై స్పందిస్తూ సోనియాగాంధీ తమపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయయని అభిప్రాయపడుతూ ఉండవచ్చు! అయితే... రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకోవాలి. కేవలంనోటీసులు జారీ చేయడమే కక్ష సాధింపు చర్యలు అయితే... ఆంధ్రప్రదేశ్ లో జగన్ విషయంలోజరిగినదాన్ని ఏమనాలి? కాంగ్రెస్ వాళ్లు రాసిన చిత్తు లేఖలను ఆధారంగా చేసుకొనే కోర్టులు సీబీఐ విచారణలను మొదలు పెట్టలేదా?! దాన్ని కక్ష సాధింపు చర్య అని అనకూడదా! అప్పట్లో అలాంటిదేమీ లేదన్నారు కాంగ్రెస్ వాళ్లు. మరి ఇప్పుడు తమ దాకా వచ్చే సరికి కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. ఇదేం నీతి?!

మరింత సమాచారం తెలుసుకోండి: