నీకు ఇష్టమైతే పార్టీలో ఉండు.. లేకపోతే బయటకు వెళ్లిపో... అని అంటున్నారు తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి వాళ్లు ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దివాకర్ రెడ్డి తన ఇష్టాను సారం ప్రవర్తిస్తే తాము ఊరుకోమని వాళ్లు అంటున్నారు. ఆయనకు అంతగా నచ్చకపోతే... తెలుగుదేశానికి రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని వారు ఉచిత సలహా ఇస్తున్నారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో దివాకర్ రెడ్డికి, ఇతర తెలుగుదేశం నేతలకు విబేధాలు తీవ్రం అయ్యాయి. ఆది నుంచి తెలుగుదేశం వ్యతిరేకిగా పేరు పొందిన దివాకర్ రెడ్డి అంటేనే పచ్చ చొక్కాలు మండిపడుతున్నాయి. ఆయన చేరికనే వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు అధికారం చేతికందడంతో దివాకర్ రెడ్డిని లెక్క చేయాల్సిన అవసరం లేదంటున్నాయి. తమ పార్టీ వల్ల దివాకర్ రెడ్డి గెలిచాడు కానీ, దివాకర్ రెడ్డి వల్ల తమ పార్టీ గెలవలేదని వాళ్లు అంటున్నారు. ఇలాంటప్పుడు తన ఇష్టాను సారం వ్యవహరిస్తాను అనే దివాకర్ రెడ్డిని తాము భరించాల్సిన అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకించి పరిటాల వర్గం దివాకర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో దివాకర్ రెడ్డి తెలుగుదేశంలో తనకంటూ ఒక ప్రత్యేకవర్గాన్ని తయారు చేసుకొంటుండటం విశేషం. జిల్లాకే చెందిన మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తదితరులతో ఇప్పుడు దివాకర్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి. విశేషం ఏమిటంటే.. వీళ్లందరితోనూ పరిటాల వర్గానికి విభేదాలున్నాయి. వీళ్లెవ్వరినీ పరిటాల వర్గం సహించడం లేదు. జిల్లా టీడీపీపై, జిల్లాపై పూర్తి ఆదిపత్యాన్ని కోరుకొంటున్న పరిటాల వర్గం వీళ్లందరితోనూ శత్రుత్వాన్ని పెంపొందించుకొంటోంది! ఫ్యాక్షన్ లోనైనా, పాలిటిక్స్ లోనైనా తమదే పై చేయిగా ఉండాలని కోరుకొంటోంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఆనంతపురం రాజకీయాలు మరింత హాట్ గా మారాయి. ఒకే పార్టీలోని రెండు బలమైన వర్గాల మధ్య పోరాటంగా మారాయి. మరి ఈ పోరాటం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: