ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక జనం బాట పట్టనున్నారు. సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనున్న ఆయన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోనే సమీక్షించి అక్కడికక్కడే తగిన నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రానున్న కాలంలో వారానికి 2రోజులు జిల్లాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రుణమాఫీ, గృహాలకు 24గంటల విద్యుత్ సరఫరా వంటి... కీలక అంశాలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో... ఇక ప్రజలతో మమేకమవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తన పర్యటనల్లో భాగంగా పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకొని ఒక్కో జిల్లాలో ఒక రోజు పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రతి బుధ, గురువారాల్లో పర్యటనలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రోజంతా ఒక జిల్లాలో పర్యటించి... విస్తృత స్థాయిలో సమీక్షలు, క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి, రాత్రికి అక్కడే బస చేసేలా పర్యటనలు ఖరారు చేశారు. మరుసటి రోజు ఉదయం మరో జిల్లాలో పర్యటన సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల నుంచి జిల్లా పర్యటనల సంప్రదాయాన్ని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. శనివారం విజయవాడలో పర్యటించనున్న చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో చంద్రబాబుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చే వారిని చంద్రబాబు కలుస్తారు. కొత్తగా నిర్మించిన భారీ నీటిపారుదల శాఖ భవనంలో కృష్ణా జిల్లా సమీక్షను ముఖ్యమంత్రి చేపట్టనున్నారు. క్షేత్రపర్యటన తొలిదశలో భాగంగా ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: