చాలారోజుల తర్వాత మళ్లీ తెలంగాణలో బంద్ పిలుపు వినబడింది. తీవ్ర నిరసనల మధ్య పెద్దగా చర్చ లేకుండానే పోలవరం బిల్లును ఎన్డీఏ సర్కారు మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవడంపై తెలంగాణలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలకు చెందిన గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి చేరిపోనున్నాయి. ఈ బిల్లు ఆమోదం ఆదివాసుల జీవించే హక్కుమీద దాడిగా పేర్కొన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ బంద్ కు తెరాస, తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. గతంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు కూడా.. ఇదే అంశంపై కేసీఆర్ బంద్ కు పిలుపునిచ్చారు. కాబోయే ముఖ్యమంత్రి అయి ఉండి బంద్ పిలుపు ఇవ్వడం ఏంటని విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సారి ఆయన నేరుగా బంద్ పిలుపు ఇవ్వకుండా.. తెలంగాణ జేఏసీతో బంద్ పిలుపు ఇప్పించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు. పార్లమెంటులో తాము ఎంత పోరాటం చేసినా కేంద్రం గొంతు నొక్కేసిందని అన్నారు. అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం జరుపుతుందని ప్రకటించారు. ముంపు మండలాలు ఆంధ్రలో కలుపుతుంటే తెలంగాణ బీజేపీ, టీడీపీ ఎంపీలు కనీసం స్పందించలేదని టీఆర్ఎస్ ప్రతినిధి కర్నె ప్రభాకర్ నిప్పులు చెరిగారు. పోలవరం బిల్లుకు లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలపడాన్ని తెలంగాణలోని ఇతర పార్టీలు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సూచనల మేరకే ఏడు మండలాలు ఆంధ్రలో కలిపారని కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ మీద మోడీ సర్కార్ వివక్ష మరోసారి బయటపడిందని మరో సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఇది మరో ఉద్యమానికి దారితీస్తుందని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. బిల్లు ఆమోదంపై తెలంగాణవ్యాప్తంగా శుక్రవారం నుంచే నిరసనలు వ్యక్త మయ్యాయి. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, మోడీ దిష్టిబొమ్మలు దగ్ధంచేశారు. తెలంగాణ బంద్ కు న్యూ డెమోక్రసీ వంటి పార్టీలతో పాటు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ ఎన్జీవోల సంఘం, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వంటి ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలిపాయి. బోనాల పండుగ నేపథ్యంలో సికిందరాబాద్ డివిజన్‌ను బంద్‌ నుంచి మినహాయిస్తున్నట్టు తెలంగాణ జేఏసీ ప్రకటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: