ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నాలుగు గంటల పాటు చర్చ ఉంటుందని ముందుగా ప్రకటించినా.. అంతా అరగంటలోనే ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వినోద్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి ఒకరిద్దరు తెలంగాణ నేతలు, భర్తృహరి వంటి ఒడిషా నేతలు మాట్లాడగానే.. స్పీకర్ ఐస్ హావిట్.. ఐస్ హావిట్.. అంటూ ఆమోద మంత్రం పఠించేశారు. బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని ప్రకటించారు. ఇది మందబలంతో తమ గొంతు నొక్కడమేనని తెలంగాణ ప్రాంత నేతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మోడీ సర్కారు మెజారిటీని అడ్డుపెట్టుకుని కనీస సంప్రదాయాలు పాటించకుండానే పోలవరం బిల్లును ఆమోదింపజేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్లమెంటులోని పోలవరం పై చర్చను చూస్తే.. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకున్న తీరు ఓసారి గుర్తుకు వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఒక విధంగా ఇంతకంటే ఎక్కు విమర్శలు తెలంగాణ బిల్లు విషయంలో వచ్చాయి. అప్పుడు కూడా పెద్గగా చర్చకు అవకాశం ఇవ్వలేదు. ప్రధాన పార్టీల ప్రధాన నాయకులు మాత్రమే ప్రసంగించారు. అప్పుడు ఇంకా దారుణంగా.. సభా ప్రసారాలు నిలిపేసి మరీ.. బిల్లు ఆమోద ప్రక్రియ పూర్తి చేశారు. అదేమంటే.. సాంకేతిక సమస్య అంటూ బుకాయించారు. పోలవరం బిల్లు సమయంలో.. తెలంగాణ ప్రాంత ఎంపీలు నిరసన తెలిపినా.. సభా కార్యక్రమాలు నిలిచిపోలేదు. కానీ తెలంగాణ బిల్లు సమయంలో.. ఎప్పుడు చర్చ ప్రారంభమైనా.. సభ హోరెత్తిపోయేది. పట్టుమని పదినిమిషాలు కూడా సభ సజావుగా సాగేది కాదు. అంతేనా.. విజయవాడ ఎంపీ లగడపాటి... కీలక సమయంలో పెప్పర్ స్ప్రే చల్లి పార్లమెంటు చరిత్రలోనే గుర్తుండిపోయేలా చేశారు. తెలంగాణ నేతల నిరసన సభను స్తంభింపజేయలేకపోయింది. కాకపోతే ఒక్కటే తేడా.. బిల్లు అనుకూల, ప్రతికూల వర్గాల స్థానాలు మారాయి. ఆ బిల్లును వ్యతిరేకించిన వారు.. ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదం తెలుపారు. ఆ బిల్లును ఆమోదించినవారు.. దీన్ని వ్యతిరేకించారు. రెండు బిల్లుల ద్వారా తేలిన విషయం ఒక్కటే. పార్లమెంటులో మెజారిటీ అభిప్రాయానదే పైచేయి అని.

మరింత సమాచారం తెలుసుకోండి: