ఈ మధ్య ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం- తెలంగాణ సీఎంల మధ్య ఆసక్తికరమైన అంశం శుక్రవారం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఇదేమీ రాజకీయలకు సంబంధించి విషయం కాదొండోయ్.. పిల్లల చదువుల గురించి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలను వెంటనే జరిపేందుకు సహకరించాలంటూ చంద్రబాబు , కేసీఆర్ కు లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. వృత్తి విద్య ప్రవేశాలను రెండు రాష్ట్రాల్లో యథాతథంగా పదేళ్ల వరకూ కొనసాగించాలని ఏపీ పునర్విభజన చట్టంలోనే ఉన్న సంగతిని చంద్రబాబు కేసీఆర్ కు గుర్తు చేశారు. జూలై 31 నాటికి అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అదే విషయాన్ని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అడ్మిషన్ల కోసం రెండు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని.. ఇంకా ఆలస్యం చేయడం ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య స్పర్థలను ఇతర రాష్ట్రాలు సొమ్ము చేసుకునే అంశాన్ని కూడా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. సరైన సమయంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తే.. రెండు రాష్ట్రాల విద్యార్థులు చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నివారించవచ్చని చంద్రబాబు లేఖలో తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన బి కేటగిరీ ఉత్తర్వులను సవరించిందని చంద్రబాబు తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నామని రాశారు. లేఖపై వెంటనే స్పందించి సహకరిస్తారన్న ఆశాభావాన్ని చంద్రబాబు లేఖలో వెలిబుచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కోసం.. చంద్రబాబు చొరవ తీసుకుని ఉత్తరం రాయడం మెచ్చుకోదగిందే. నా దగ్గర పనిచేసిన వ్యక్తి అంటూ కేసీఆర్ గురించి చాలాసార్లు.. చులకనగా మాట్లాడిన చంద్రబాబే.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కు.. ఏపీ సీఎం హోదాలో లేఖ రాయడం విశేషమే. ఇదే చొరవ.. చర్చల విషయంలోనూ చూపి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే.. ఎన్నో విషయాల్లో పరిష్కారమవుతాయి.. మరి ఆ శుభసమయం ఎప్పుడు వస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: