ప్రభుత్వం మారిన ప్రతిసారీ అంతకు ముందు వాళ్లు పెట్టిన పథకాలను మార్చేయడం మన రాజకీయులకు పరిపాటి. పూర్తి స్థాయిలో పక్కన పెట్టకపోయినా కనీసం పేర్లలో మార్పులు చేసి రాజకీయానందం పొందడం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో ఇందిరా జలప్రభ ఉంటే... టీడీపీ రాగానే ఎన్టీఆర్ సుజల స్రవంతి వంటివి రూపొందడం అందులో భాగమే. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న చంద్రబాబు సైతం ఈ పేర్లు మార్చే ప్రక్రియ పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే టీడీపీ అధినేత పూర్తిస్థాయిలో దానిపై దృష్టి పెట్టకున్నా... ఆ పార్టీ నాయకులు మాత్రం వైఎస్సార్ పేరును మరుగున పరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రెండోసారి సీఎంగా గెలిచిన కొద్దిరోజులకే మరణించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రిగానే హెలికాప్టర్ కుప్పకూలడంతో మరణించిన ఆయన గౌరవార్థం... వైఎస్ సొంత జిల్లా కడప పేరను వైఎస్సార్ జిల్లాగా మార్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2009 నుంచీ నేటి వరకూ రికార్డుల్లో వైఎస్సార్ జిల్లాగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా గెలిచిన టీడీపీ ప్రభుత్వం వద్దకు ఈ పేరును మార్చాలనే విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొందరు వైఎస్సార్ జిల్లా పేరును మార్చి... పాత పేరును పునరుద్ధరించాలని ఇప్పటికే పార్టీ అధినేత బాబును కోరారు. కడపను తిరుమల వెంకటేశ్వర స్వామి దేవుడి గడపగా చెప్పుకుంటారు. అలాంటి జిల్లాను వైఎస్సార్ పేరుతో పిలుస్తుండడం అర్ధరహితమని టీడీపీ నేతలు రాంగోపాల్ రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తక్షణమే కడప జిల్లాకు పాత పేరును పునరుద్ధరించాలని కోరారు. దీనిపై ఏపీ సీఎం బాబు దృష్టి పడితే పేరు మారడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. అదే జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగడం ఖాయం. ఇప్పటికే పథకాల పేర్ల మార్పు పై చర్యలు చేపడుతున్న చంద్రబాబు... కడప వ్యవహారాన్ని ఏ ధరికి చేరుస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: