ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఏపీఎన్జీవోలు విజయవాడలో ఘనంగా సన్మానించారు. సన్మానం అంటే.. ఏదైనా సాధించినవారికే చేస్తారు కదా.. మరి ఈయన అప్పుడే ఏం సాధించడాని సన్మానం చేశారని సందేహం వచ్చినా అప్పుడే అడక్కండి. సరే ఎంతైనా సీఎం గారు కదా.. అందులోనూ సీఎం అయ్యాక తొలిసారి బెజవాడ వచ్చారు. మరి ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలి కదా.. బహుశా ఏపీ ఎన్జీవోల సన్మానం వెనుక అసలు ఉద్దేశం అదే అయ్యుంటుందేమో.. ఏదేమైనా సన్మాన కార్యక్రమం బాగానే జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు.. చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. రాష్ట్రాభివృద్ది కోసం కసితో పనిచేస్తున్న నాయకుడని కితాబిచ్చారు. ఆయనకు అన్నివిధాలా సహకరిస్తామని బాస చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60ఏళ్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. ఇక అక్కడ నుంచి ముఖ్యమంత్రి ముందు ఉద్యోగుల కోర్కెల చిట్టా విప్పారు. ఒక్కొక్కటిగా డిమాండ్లు చెబుతూ చంద్రబాబు ముందరి కాళ్లకు బంధం వేయడం ప్రారంభించారు. మరి సన్మానమంటే ఊరికే చేస్తారా.. ఆ మాత్రం కోర్కెలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఉడుక్కోకండి.. అసలు విషయం ఏమిటంటే.. అశోక్ బాబు ఇక్కడే గాడి తప్పినట్టు కనిపించింది. న్యాయమైన కోర్కెలు బయటపెట్టిన తర్వాత అశోక్ బాబు ఓ చిత్రమైన కోరిక కోరారు. అదేంటంటే.. ఉద్యోగులపై పెట్టే ఏసీబీ కేసుల నుంచి సత్వరమే విముక్తి కల్పించమని. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై కేసులు నమోదైతే..అది రుజువయ్యేవరకూ చర్యలు తీసుకోకూడదట. ఏసీబీ పేరుతో వేధింపులు ఎక్కువయ్యాయని వాటి నుంచి రక్షణ కావాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వోద్యోగులంటేనే జనం భయపడిపోతున్నారు. వారి చేతులు తడపలేక.. తడపందే పని కాక నానా తంటాలు పడుతున్నారు. అలాంటి ఉద్యోగులు కాస్తో కూస్తో భయపడేది ఒక్క ఏసీబీ అధికారులకే.. వారు పెట్టే కేసులకే.. ఇప్పుడు ఆ ఒక్క భయం కూడా లేకుండా పోతే.. ఇక ఉద్యోగులు మాట వింటారా.. పబ్లిగ్గా లంచాలు డిమాండ్ చేయరూ.. ఏసీబీ కేసు విచారణ పూర్తయ్యేదాకా.. ఉద్యోగిపై చర్యలు వద్దంటే.. ఇక అవినీతి చేసుకోండయ్యా అంటూ వారికి లైసెన్స్ ఇచ్చినట్టే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: