బాబూ.. తిరుపతి వెంకన్నతో చెలగాటం వద్దు..  ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకుంటున్న ఓ నిర్ణయం తిరుమల శ్రీనివాసునికి కోపం తెప్పిస్తుందేమో అన్న అనుమానం కొందరు టీడీపీ కార్యకర్తల్లోనే కలుగుతోంది. చంద్రబాబుకూ శ్రీనివాసుడికి లింకేమిటనుకుంటున్నారా.. ఉంది. అదే ఎర్ర చందనం వ్యవహారం. రుణమాఫీ వంటి భారీ బడ్జెట్ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నిధుల వేటలో భాగంగా.. ఎర్రచందనంపై కన్నేసిన సంగతి తెలిసిందే.. అందులోనూ ఏడేళ్ల నుంచి వేలం వేయకుండా గుట్టలకొద్దీ చందనం నిల్వలు పోగుబడి ఉన్నాయి మరి. వాటిని ఉన్నపళంగా అమ్మేసినా.. తక్కువలో తక్కువ పాతికవేల కోట్ల రూపాయల సంపద రాష్ట్ర ఖజానాకు ఒనగూరుతుంది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ఎర్రచందనం అమ్మితే తప్పేంటని అడగొచ్చు. కానీ ఓ రకంగా అది తప్పే అవుతుందంటున్నారు కొందరు భక్తులు.. ఎలాగంటే.. ఎర్రచందనం దొరికేది కేవలం శేషాచలం అడవుల్లోనే. అక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా ఎర్ర చందనం లభించదు. అందుకే దానికి అంత గిరాకీ.. విలువ కూడా కోట్లలో ఉంటుంది. మరి శేషాచలం కొండలు ఎవరివి..? శేషాచలంతో పాటు ఏడు కొండలు తిరుమల శ్రీవారివే అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు.. ఎర్ర చందనం కూడా శ్రీవారి ఆస్తే అవుతుంది కదా.. శ్రీవారికి ప్రత్యేకంగా టిటిడి వంటి వ్యవస్థ ఉన్నప్పుడు.. చందనం టిటిడికి చెందడమే సబబన్న వాదన వినిపిస్తోంది. ఎర్ర చందనాన్ని వేలం వేసి కోట్లాది రూపాయలను ప్రభుత్వం తీసుకుంటే అది భక్తుల మనోభావలను దెబ్బతీసినట్లే అవుతుందనే అభిప్రాయాన్ని పలువురు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. తిరుమల శ్రీవారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయన తన ప్రతాపం చూపుతారనే వాదన ఒకటి ఉంది. గతంలో కొందరు ముఖ్యమంత్రులు.. తిరుపతిపై కన్నేసి.. జీవోలు తెచ్చి.. తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంకన్న ఆస్తి జోలికి వెళ్లి.. కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని టీడీపీ కార్యకర్తలు కొందరు బాబుకు సూచిస్తున్నారు. అయినా ఇలాంటి సంగతులు చిత్తూరు జిల్లా వాసి.. వేంకటేశ్వరభక్తుడైన చంద్రబాబుకు వేరే ఎవరైనా చెప్పాలా.. ఆయనకు తెలియదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: