పేరుకు తెలంగాణ కొత్త రాష్ట్రమైనా.. వాస్తవానికి కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశే.. పేరొక్కటే పాతది కానీ సమస్యలన్నీ కొత్తవే.. రాజధాని నిర్మాణంతోపాటు.. విభజన సీమాంధ్రకు తెచ్చిన చిక్కులెన్నో... మరి వాటిని అధిగమించాలంటే ఏంచేయాలి. నేతలంతా కలసికట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి. రాజకీయాలు పక్కకుపెట్టి ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలి. ప్రజల్లో ఓ నమ్మకం, విశ్వాసం కల్పించేందుకు కృషి చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా అదే చేస్తున్నారు. కాకపోతే.. వారు కలసి కట్టుగా దృష్టి పెట్టింది జన సంక్షేమం కోసం కాదు.. వారి స్వలాభం కోసం. విభజన తెచ్చిపెట్టిన సమస్యలను పరిష్కరించడం మాట పక్కుకుపెట్టిన సీమాంధ్ర నేతలు.. విభజనతో అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఉబలాటపడుతున్నారు. రాజధాని అంశాన్ని ఉపయోగించుకుని కోట్లు గడించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందుగానే ఊహించిన రాష్ట్రమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు.. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఇంకా చేస్తున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులతోపాటు కొందరు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కొందరు రాజధాని వచ్చే అవకాశం ఉందన్న ముందుచూపుతో ఆయా ప్రాంతాల్లో వందలాది ఎకరాలను బినామీ పేర్లతో కొనుగోలు చేస్తున్నారు.  విజయవాడ నుండి ఒంగోలు మధ్యన మాజీ ఎంపి ఒకరు దాదాపు 400 ఎకరాలను ఇప్పటికే బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు కోస్తా ప్రాంతంలో టాక్. కేంద్ర మాజీ మంత్రి ఒకరు దాదాపు 500ఎకరాలను ఇటీవల కాలంలో తక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రులు కూడా తక్కువ తినలేదట. ఇప్పటికే వారికి ఉన్న వందలాది ఎకరాల భూములతోపాటు వాటికి అదనంగా మరికొంత భూములను సేకరిస్తున్నట్లు స్థానికుల కథనం. రాజధాని భూముల భూం విజయవాడ-గుంటూరులకే పరిమితం కావడం లేదు. కర్నూలు ప్రాంతంలోనూ కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరు భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు తెలుది. ఏలూరు, నెల్లూరు, తదితర ప్రాంతాల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం జోరుగా సాగుతోంది. విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాల్లో కూడా సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నారనేదానిపై ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొనుగోళ్ల ద్వారా మాత్రమే కాకుండా.. ఖాళీగా ఉన్న బంజరు భూములను కూడా బడా నేతలు ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలపై ఎక్కువగా నేతలు కన్నేశారట. జనం సమస్యలు ఎటుపోతే మనకెందుకు.. మనం లాభపడితే చాలన్నట్టుగా ఉంది సీమాంధ్ర నేతల వ్యవహారం.

మరింత సమాచారం తెలుసుకోండి: