భారతీయ జనతా పార్టీ క్రమంగా నరేంద్ర మోడీ చేతుల్లోకి వెళ్తోందా... తిరుగులేని మెజారిటీతో ప్రధాని పీఠం పై కూర్చున్న మోడీ పార్టీలోనూ పట్టును పెంచుకున్నారా... అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుత బీజేపీ తీరు చూస్తుంటే. భారత ప్రభుత్వాధినేతగా ఉన్న నమో... భారతీయ జనతా పార్టీకి సైతం తెర వెనుక అధినేతగా మారారు. తాజాగా బీజేపీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ పదవుల పంపకం వ్యవహారమే పరిస్థితిని కళ్లకు కడుతోంది. అద్వానీ వర్గాన్ని దూరం పెట్టిన మోడీ... తన వాళ్లకు మాత్రం అగ్రతాంబూలం అందించారు. మొన్నటిదాకా లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మాస్వరాజ్ కు తాజాగా రెండు సభలలోనూ ఎలాంటి పదవీ దక్కకపోవడం మోడీ ఎత్తుల్లో భాగంగానే భావించాలి. మొదటి నుంచీ అద్వానీకి దగ్గరగా ఉంటుండడమే సుష్మాకు నరేంద్ర మోడీ చెక్ చెప్పడానికి కారణం అని వేరే చెప్పక్కర్లేదు. ఇదే కారణంతో అద్వానీ వర్గానికి చెందిన సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, కల్ రాజ్ మిశ్రా, యశ్వంత్ సిన్హాలను సైతం మోడీ పక్కన పెట్టినట్లుగా భావించాలి. గుజరాత్ అల్లర్ల సమయం నుంచీ పార్టీలో తనకు అండగా నిలిచిన వారిని అందలం ఎక్కించిన నమో... తనను వ్యతిరేకించిన ప్రత్యర్థి వర్గాన్ని మాత్రం అందనంత దూరంలో ఉంచారు. ఇప్పటికే తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షా కు బీజేపీ సారథ్య బాధ్యతలు దక్కేలా చేసి... పార్టీ పై పట్టు సాధించిన నరేంద్రుడు. తాజాగా లోక్ సభ, రాజ్యసభ పదవుల పంపకం విషయంలోనూ మరోసారి తన మార్క్ వేశారు. ఇరు సభలలోనూ తానే పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించనున్నారు. లోక్ సభలో బీజేపీ పక్షనేతగా రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎంపికయ్యారు. పార్లమెంటులో ప్రభుత్వీ చీఫ్ విప్ గా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యతలు తీసుకోనున్నారు. ఆది నుంచీ తన వాళ్లైన రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులకు మంత్రి వర్గ శాఖల కేటాయింపుల్లోనూ అగ్రతాంబూలమే అందించారు నరేంద్ర మోడీ. తాజాగా మరోసారి ఆ ప్రేమను చాటుకుని పార్టీ పై పట్టు తనదేనని చూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: