రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు విడిపోయినందున తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ న్యాయవాదుల సంయుక్త కార్యాచరణ సమితి (టీ జాక్‌) ఆందోళనబాట పట్టింది. ముందుగా నిరవధిక నిరాహార దీక్షలు, తదుపరి కోర్టుల బహిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు తొలి దశలో ఈ నెల 15 నుంచి 30 వరకు తెలంగాణవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనుంది. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి ఆందోళనను ఉధృతం చేస్తారు. జూన్‌ 2న అపాయింటెడ్‌ డే తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఉమ్మడి హైకోర్టుగా మార్చారు. హైకోర్టు ఆఫ్‌ జ్యుడీకేచర్‌ ఎట్‌ హైదరాబాద్‌ ఫర్‌ ది స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అడ్వకేట్‌ జనరల్స్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్స్‌ నియామకం జరిగింది. వారికి ప్రత్యేక ఛాంబర్లు కూడా కేటాయించారు. జీపీలు,ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిల్స్‌ నియామక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు స్పెషల్‌ జీపీలను, జీపీలు, ఏజీపీల నియామకం జరిపింది. రేపోమాపో తెలంగాణ ప్రభుత్వం కూడా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దరఖాస్తులను న్యాయశాఖ స్వీకరించింది.15 వ తేది నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు తెలంగాణ న్యాయవాదు జాక్‌ కన్వీనర్‌ ఎం రాజేందర్‌రెడ్డి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: