కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కాని అతని దూకుడు, అతని నిర్ణయాలు చూస్తుంటే తొలిసారి సీఎం అయినట్లుగా లేదు. సీఎంగా ఎంతో అనుభవమున్న వాడిలా దూసుకుపోతున్నాడు. మరి ఆంధ్రా సీఎం చంద్రబాబును చూస్తే ముఖ్యమంత్రిగా పదేళ్ల అనుభవం ఉంది. కాని ఆయన పనితీరు చూస్తుంటే కొత్తగా సీఎం అయినట్లుంది. కేసీఆర్ వేగాన్ని చంద్రబాబు ఏ మాత్రం అందుకోలేకపోతున్నారు. నిన్నటిదాకా ఒకటిగా వున్న రాష్ర్టానికి విడిపోయిన తర్వాత వీరిద్దరూ సీఎంలయ్యారు. అయితే పనితీరులో మాత్రం ఇద్దరి మధ్య చెప్పలేనంత తేడా కనిపిస్తుంది. రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణకు అన్నీ సమకూరాయి. వాళ్లది వడ్డించిన విస్తరి పరిస్థితి. అయినా తెలంగాణకు ఇంకా ఏదో సాధించిపెట్టాలనే తపనతో కేసీఆర్, ఆయన మంత్రివర్గ సభ్యులు పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తెలంగాణకే వచ్చేలా పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్నారు. వాళ్లు అంత వేగంగా ఉంటే సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు దాటినా చంద్రబాబు ఇంకా కుర్చీలు, బల్లలు వెదుక్కునే పనిలోనే ఉన్నాడు. అసలు సీమాంధ్ర రాష్ర్టంలో పరిపాలన ఉందా లేదా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ర్ట విభజనతో సీమాంధ్ర చాలా నష్టపోయింది. ఇది కోలుకోవాలంటే కొత్త ప్రభుత్వం చాలా వేగవంతంగా, శక్తివంతంగా పనిచేయాలి. ఒకప్పుడు తెలంగాణ మన రాష్ర్టంలో భాగం. ఇప్పుడు అభివృద్ధి ప్రక్రియలో తెలంగాణే మనకు పోటీ అవుతోంది. కాబట్టి ప్రభుత్వం చురుకుగా, చొరవగా స్పందిస్తుంటేనే అభివృద్ధి ముందుకు కదులుతుంది. చంద్రబాబులో చూస్తే వేగం బదులు మందకొడితనం ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన వాలకం చూస్తే నిదానమే ప్రదానం అన్నట్లుగా వుంది. కాని నెలరోజుల్లో ఆయన సాధించింది, చేసింది ఏమీ లేదని ప్రజలు అప్పుడే పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు ఇంకా హైదరాబాద్ ను వదిలి రాకపోవడం, భౌగోళికంగా తెలంగాణ మన నుండి విడిపోవడంతో చంద్రబాబు కూడా సీమాంధ్రకు దూరంగా వున్నట్లే అనిపిస్తోంది. మన రాష్ర్టంలో ప్రభుత్వం లేదు, పాలన లేదనే అభిప్రాయం ఏర్పడుతోంది. ముఖ్యమంత్రేం చేస్తున్నారో, మంత్రులేం చేస్తున్నారో కూడా మనకు కనిపించడం లేదు. ప్రమాణస్వీకారం చేసినరోజు చంద్రబాబు సంతకాలు చేసిన హామీలు కూడా ఇంతవరకు ఆచరణ రూపం దాల్చలేదు. ముఖ్యంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయవాడలో క్యాంప్ ఆఫీసు పెట్టుకుంటానని చంద్రబాబు చెప్పిన మాటలు కూడా కార్యరూపం దాల్చడం లేదు. హైదరాబాద్ లో తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాల మరమ్మత్తులకు 10కోట్లు ఖర్చుపెట్టడం చూస్తుంటే ఇప్పట్లో సీమాంధ్రకు వచ్చే ఉద్దేశ్యం ఆయనకు లేనట్లు కనిపిస్తుంది. చంద్రబాబు, మంత్రులు హైదరాబాద్ లోనే ఉండిపోవడంతో సీమాంధ్రలోని 13జిల్లాల్లో పరిస్థితుల్లో ఎటువంటి మార్పులేదు. విభజన ఉద్యమ సమయంలో ఇక్కడ ఎలాగైతే వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు స్థంభించి ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. సీమాంధ్ర నుండి పరిపాలన సాగిస్తే అన్ని రకాల వ్యాపారాలు పుంజుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సీమాంధ్రలోని పలు జిల్లాల్లో రియల్టర్లు కోలుకునే అవకాశముంది. చంద్రబాబు ఇంకా రెండుకళ్ల సిద్ధాంతం అంటూ సీమాంధ్రతో పాటు, తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని కలలు కంటూ సీమాంధ్ర సీఎంగా ఈ ప్రాంతానికి సంపూర్ణ న్యాయం చేయకుండా ఈ ప్రాంత ప్రజల కళ్లు పొడుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: