అధికారం.. దీని కోసం ఎలాంటి గడ్డైనా కరవడానికి నాయకులు సిద్దపడిపోతున్నారు. అది ముఖ్యమంత్రి పీఠం కానీయండి.. గ్రామసర్పంచ్ పదవి కానీయండి. అధికారం మాత్రం తమకో తమవారికో దక్కాలి. ఇదొక్కటే లక్ష్యం. కానీ ఆ అధికారం చేరే మార్గాలపై మాత్రం ఎలాంటి నియమాలు, నిబంధనలు విధించదలుచుకోలేదు నేటి నేతలు. అందుకు ఏ ఒక్క పార్టీ కూడా మినహాయింపు కాదు. ఒక పార్టీ విలువలకు వలువలు ఒదిలేసినప్పుడు మరో పార్టీ ఆక్రోశించడం.. మళ్లీ ఆక్రోశించిన ఆ పార్టీయే మరో చోట.. మరో విషయంలో.. అదే తరహా తప్పుడు చర్యలకు పాల్పడటం సహజంగా మారాయి. ఇలాంటప్పుడు ఏ పార్టీని మెచ్చుకుంటాం.. ఏ పార్టీని విమర్శిస్తాం. అన్నీ ఆ తాను ముక్కలే అని నిట్టూర్చడం తప్ప. ప్రకాశం జడ్పీ ఎన్నిక స్వార్థరాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. రాజకీయ ఎత్తులకు పై ఎత్తులకు నిలయంగా నిలిచింది. ఈ జడ్పీలో న్యాయం ప్రకారం జగన్ పార్టీకే మెజారిటీ ఉంది. ఇక్కడ ఆ పార్టీకి 31 మంది జడ్పీటీసీలు, టీడీపీకి 25 మంది జడ్పీటీసీలు దక్కాయి. మెజారిటీ లేకపోయినా అధికారం ఉంది కదా. అందుకే టీడీపీ దీన్ని హస్త గతం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆకర్ష మంత్రం ఉపయోగించి ముగ్గురు వైసీపీ జడ్పీటీసీలను తమవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు బలం సమానం అయ్యింది. మరి గెలవడం ఎలా.. అందుకే.. ఓ జడ్పీటీసీ మీద పాత కేసు తిరగదోడి అరెస్టు చేయించారు. అలా చేస్తే ఆయన ఓటేయడు కదా.. అది వారి ధీమా.. కొన్ని గంటల్లో ఓటేయాల్సిన జడ్పీటీసీ రంగారెడ్డిని ఓటుకు దూరం చేశారు. విజయం తమదేననుకున్నారు. ఇక్కడే అసలు టీడీపీకి మాంచి జలక్ తగిలింది. ప్రత్యర్థి పార్టీని బాగానే కట్టడి చేయగలిగినా.. సొంత పార్టీలోని అసమ్మతిని కాచుకోలేకపోయారు. జగన్ పార్టీ కూడా వ్యూహత్మకంగా తమకు జడ్పీ పీఠం దక్కకపోయినా.. టీడీపీకి దక్కకూడదని డిసైడయ్యింది. అనూహ్యంగా టీడీపీ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చి అతన్ని గెలిపించింది. టీడీపీ నుంచి గెలిచి.. స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈదర హరిబాబు చివరకు జగన్ పార్టీ మద్దతుతో ఛైర్మన్ అయ్యారు. ఈదరకు వైస్సార్ కాంగ్రెస్ మద్దతుతో 28 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధికి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి. ఈదర హరిబాబు ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా పీఠం దక్కించుకోవాలన్న టీడీపీ ఎత్తుగడను.. వైస్సార్ కాంగ్రెస్ కూడా అడ్డదారిలోనే అడ్డుకుంది. అధికారం ఉపయోగించి ఏదైనా చేయొచ్చనుకున్నవారికి ఈ ట్విస్టుతో దిమ్మతిరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: